Thursday 14 April 2016

ధిక్కార సంకేతం

       తన మరణ వాంగ్మూలాన్నే వ్యవస్థ పై ధిక్కార ప్రకటన చేసి వెళ్లిపోయాడు రోహిత్‌. క్యాంపస్‌ పరిణామాల పరిధిని తక్కువ చేయడానికి ఎవరైనా ఏ తెరల వెనుక అయినా దాక్కునే ప్రయత్నం చేయొచ్చు. కానీ రోహిత్‌ చనిపోయిన తర్వాత మీడియా గ్లేర్‌లో మన అందరి కళ్లముందూ జరిగిన నాలుగు విషయాలైతే తప్పించుకునే వీలు లేకుండా వ్వవస్థ స్వభావాన్ని మన ముందుంచుతున్నాయి.. ఈ నాలుగూ నిన్నా మొన్నా జరిగిన ఘటనలు. ఒకటి అతని శవాన్ని దహనం చేసిన తీరు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి పోలీసులు శవాన్ని తరలించి నగరమంతా తిప్పుతూ ఆందోళనకారుల దృష్టిమళ్లించి క్షణాల్లో తగలేశారు. విద్యార్థులు ర్యాలీ చేస్తారనో సెంట్రల్‌ విశ్వవిద్యాలయం తీసుకువెళ్లి పెద్ద యెత్తున ఉద్యమిస్తారనో పోలీసులు భయపడి ఉండొచ్చు. కానీ పెద్ద కులపోళ్లకు సంబంధించిన పెద్దమనిషి చనిపోతే ఇలాగే చేస్తారా! ఎక్కడికి తీసుకుపోతున్నారో. ఎక్కడ దహనం చేస్తారో శవం వెంట ఉన్న తల్లికి తెలీదు. చెట్టంత కొడుకుపోయి దుక్ఖంలో ఉన్న తల్లిని వెంటపెట్టుకుని వెంటపడుతున్న కార్యకర్తలను తప్పించుకుని పోలీసులు అంత రహస్యంగా, దొంగతనంగా ఎందుకు తగులబెట్టాల్సి వచ్చింది? ఒక లక్ష్యం కోసం ప్రయాణిస్తూ ఆ మార్గంలో మరణించినపుడు సహ ప్రయాణికులు బంధువులకేమీ తక్కువ కారు. అతనికి మిత్రులు చాలామందే ఉన్నారు. పోలీసులు ఇలా చేస్తారని అనుమానం వచ్చి బృందాలు బృందాలుగా స్మశానలన్నింటిచుట్టూ పరుగులు పెట్టారు. అయినా కడసారి గౌరవం ఇవ్వకుండా చేయగలిగారు పోలీసులు. విద్యార్థులు క్రైస్తవ స్మశానాల వెంట తిరుగుతూ ఉంటే పోలీసులు సైలెంట్‌గా అంబర్‌ పేట స్మశాన వాటికలో కాల్చేశారు. వాళ్లు ఈ విద్యలో పండిపోయి ఉన్నారు. ఇందులో పని చేసింది ఏ అహంకారం!
రెండో ఉదంతం -లీకైన వీడియో. అది ఎబివిపి వాళ్లు సెలక్టెడ్‌గా కట్‌ చేసి పంపించిన వీడియో అని తెలుస్తూనే ఉంది. అయినా ఆ వీడియోలో ఏముంది? కొంతమంది ఎబివిపి కార్యకర్తలు రోహిత్‌ని చుట్టుముట్టి ప్రశ్నించడం ఉంది. క్యాంపస్‌లో కొంతమంది గుంపుగా వచ్చి ప్రత్యర్థి విద్యార్థి సంఘానికి చెందిన మనిషిని ఒంటరిచేసి చేసి చుట్టుముడితే వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కాబట్టి ఆ సందర్భాన్నుంచి సంభాషణను విడదీసి చూపడంలో నే కుట్ర ఉంది. అయినా ఆ వీడియోలో ఏముంది? బ్యానర్లు చించావా అంటే చించాను అన్నాడు,. చించుతాను అని కూడా అన్నాడు. అందులో అంత పెద్ద నేరం ఏముందని? అదేదో సాధించినట్టు, చనిపోయిన మనిషిని బోనులో పెట్టగలిగిన వీడియో అన్నట్టు షో చేశారు. ఏదైనా వీడియోను సగం సగం అట్లా అమెచ్యూరిష్‌గా షూట్‌ చేసి బూజరబూజరగా చూపిస్తే అందులో ఉండకూడని దేదో ఉందని సమాజం భావించేట్టు మీడియా ఇప్పటికే అలవాటు చేసింది. ఆ అలవాటును తమ ప్రయోజనాలకు అనువుగా వాడుకోవాలనే కుట్ర ఉంది ఇందులో. ఒక వీడియోలో కొంత భాగాన్ని తమకు అనువుగా ఎవరైనా మలుచుకుని మీడియాకు పంపించారంటేనే అందులో నేర స్వభావం దాగుంది అని అర్థం. పైగా ఆ వీడియో అంతకుముందే సర్కులేషన్లో ఉన్నదే. పూర్తి వీడియో పెట్టండి దమ్ముంటే అని రోహిత్‌ స్వయంగా సవాల్‌ విసిరి ఉన్నాడు కూడా. కానీ అంతా కలిసి ఆ చనిపోయిన కుర్రాడి మీద సానుభూతిని తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా దాన్ని ఓవర్‌ ప్లే చేశారు. ఇందులో పనిచేసింది ఏ అహంకారం!
ఈ రెంటినీ మించింది కుల సర్టిఫికెట్ల గొడవ. అతను ఎస్సీనా కాదా అనే అనవసరమైన చర్చ లేవదీశారు. తల్లిది ఏ కులము? తండ్రిది ఏ కులము? అతను వడ్డెర అవుతాడా, మాల అవుతాడా! ఏమిటీ చర్చ. ఎంత అమానవీయం? ఒక మనిషి చనిపోయాడు. భవిష్యత్తు సమాజానికి గొప్ప ఆశ్వాసం ఇవ్వగలిగిన ఒక ఆలోచనాపరుడు చనిపోయాడు. తన పట్ల తన తోటివారి పట్ల విశ్వవిద్యాలయం చూపిన అమానవీయ వైఖరి వల్లే చనిపోయాడని తెలుస్తూనే ఉంది. విశ్వవిద్యాలయ యాజమాన్యం, ముఖ్యంగా విసి వైఖరి అతని చావుకు కారణమైందా లేదా, ఒత్తిడి తెస్తూ కేంద్రం లేఖలు పంపిందా లేదా అనేవి అసలు విషయాలు. విశ్వవిద్యాలయమూ, కేంద్రమూ మొత్తం వ్యవస్థ రకరకాల కంపులతో కుళ్లిపోయి ఒక సున్నిత మనస్కుడిని ఒంటరి చేసి బలితీసుకున్నాయా, లేదా అనేది అసలు విషయం. ఆ కుర్రాడు వడ్డెర అయినా మాల అయినా ఇందులో తేడా ఏమైనా ఉంటుందా! మెదడుకు పిలకలు వేసే వాళ్లు ఉంటారని తెలిసే నేమో అతను జాషువా కులం గురించి ఉద్వేగపూరితమైన చర్చ తన ఫేస్‌బుక్‌ పోస్టుల్లో చేసి ఉన్నాడు. సమాజానికి ఉపయోగపడగలిగిన ఆలోచించగలిగిన ఒక మనిషి అన్యాయంగా పోయాడు అనే కనీసమైన బాధ లేకుండా అతని తల్లిదండ్రుల కులం వెంట డిటెక్టివ్‌ల్లాగా పరిగెట్టే వాళ్లను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. సాంకేతికమైన అంశాల్లోనూ కోర్టుల్లోనూ కుల సర్టిఫికెట్ల అవసరం రావచ్చునేమో. ఆ సందర్భం వచ్చినపుడు ఆ చట్టమో న్యాయమో తేల్చుకుంటాయి. తాను ఏ ఐడెంటిటీతో అయితే ఏకీభవించి ఆ ఐడెంటికీ ఈ దేశంలో ఎదురవుతున్న అవమానాల గురించి తల్లడిల్లి చివరి క్షణం దాకా పోరాడి నిరసన రూపంగా ఈ వ్యవస్థ మొద్దు చర్మంమీద ఉమ్మేసి వెళ్లిపోయిన ఒక యువకుడికి అర్జెంటుగా వేరే కులం ఆపాదించి విషయాన్ని దారి మళ్లించాలని చూసే వాళ్లను ఏమనాలి? పర్వర్ట్‌డ్‌, సిక్ మైండ్స్‌?తల్లికులం కులం కాదని చెప్పే మగ దురహంకార వ్యవస్థను అతను బోనులో నిలబెట్టి వెళ్లాడు. కనీస మానవీయ స్పృ హలేకుండా అసలు విషయానికి ఏ మాత్రం సంబంధం లేని దుర్మార్గమైన చర్చను పదే పదే ముందుకు తీసుకురావడంలో పనిచేస్తున్నది ఏ అహంకారం? ఏ ఆధిపత్యం?
విద్యార్థులకు శిక్ష విధించిన విచారణ కమిటీకి దళితులు నేతృత్వం వహించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. అసలు ఆ కమిటీలోనే దళితులు లేరు. విశ్వవిద్యాలం ఎగ్జిక్యుటీవ్ కౌన్సిల్‌లో ఎన్నడూ లేరు. తగుదునమ్మా అని మీడియాముందు గంభీరమైన బేస్‌ వాయిస్‌ పెట్టి నిర్లజ్జగాఇంత అబద్ధం ఆడడంలో పనిచేసింది ఏ అహంకారం?
విశ్వవిద్యాలయాల్లో కులాధిపత్యం పాతుకుపోయి ఉన్నదని తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానమేమీ అక్కర్లేదు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో గత ఏడేళ్లలో చనిపోయిన విద్యార్థులందరూ దళిత బహుజనులే కావడం యాదృచ్ఛికం అవుతుందా! సుఖం మీకు శోకం మాకు అని మీ గీత చెపుతోందా అన్న ప్రశ్నకు వ్యవస్థను నడిపిస్తున్న పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.

అసలు ఆ విద్యార్థులకు విధించిన శిక్షలోనే ఫ్యూడల్‌ కులం కంపు ఉంది. క్యాంపస్‌ హాస్టల్‌నుంచి విద్యార్థులను బహిష్కరించడం దేనికి సంకేతం? ఇది సెక్యులర్‌ శిక్షా? గ్రామాల్లో తమ మాట విననపుడు పెత్తందార్లు దళిత బహుజనులకు విధించే సాంఘిక బహిష్కారానికి దీనికి తేడా ఉందా? సదరు వైస్‌ చాన్సలర్‌ ఛీప్‌ వార్డన్‌గా ఉన్నపుడే పదిమంది దళితబహుజన రీసెర్చ్‌ స్కాలర్స్‌ని రస్టికేట్‌ చేశారు. కెరీర్‌కు సంబంధించి వారి భవితకు సంబంధించి అది ఉరిశిక్షతో సమానం. ఆ సందర్భంగా బాలగోపాల్ సమాజానికి అవసరమైన ప్రశ్నలు వేసి ఉన్నారు. పట్టించుకున్నదెవరు? క్యాంపస్‌ పాలిటిక్స్‌లో ఆవేశకావేశాలు ఉంటాయి. అవి కొత్తవేమీ కావు. కానీ రస్టికేట్‌ చేసేంత దూరం పోవడంలో పనిచేసిన అంశం ఏమిటి? వాళ్లు అగ్రవర్ణ పెద్దమనుషుల పుత్రులే అయితే ఆ పనిచేసి ఉండేవారా! మనకు తెలిసీ తెలీకుండా లోలోపల పనిచేసే కులం ఇందులో కనిపించడం లేదా! ఉరిశిక్షను వ్యతిరేకించడం అనేది నాగరికమైన మనిషి ఎవరైనా చేయాల్సిన పని. అది ఎబివిపి వారి జ్ఞాన పరిధిని మించిన విషయం. నిక్కర్ల నుంచి ఫ్యాంట్లకు అప్‌గ్రేడ్‌ అయిన వారికి కూడా అందని విషయమే. అది వారికి మింగుడుపడకపోవచ్చు. వారి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేయడం సంఘవ్యతిరేక కార్యకలాపం ఎలా అయ్యింది? టెర్రరిస్టు యాక్టివిటీ ఎలా అయ్యింది? ఇలాంటి నిర్వచనాలు ఇచ్చే అధికారం వారికి ఇచ్చిందెవరు? నాగరికమైన పని చేసినవారిని టెర్రిరిస్టు యాక్టివిటీస్‌ చేస్తున్నవాళ్లు అని ముద్ర వేయడంతో పనిచేసే అంశం ఏమిటి?ఈ వ్యవస్థలో మేము వాళ్లు అనే విభజనలో ఈ వాళ్లు అనేది ఎప్పుడూ పేదలు, దళిత బహుజనులు, మైనారిటీలే ఎందుకవుతున్నారు? మతాన్ని కులాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించేవారు కులనిర్మూలనా వాదులను కులవాదులుగా చిత్రించడంలో పనిచేసే అంశం ఏమిటి? ఈ విలోమ న్యాయానికి కారణమేంటి? ఇవన్నీ యాదృఛ్చికమైన విషయాలా? హిందూత్వ వాదులు మరే భావజాలాన్ని సహించే స్థితిలో లేరని తమ అధికారాన్ని బలాన్ని ఉపయోగించి అణగదొక్కడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపే సంకేతాలు కావా?
అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ విద్యార్థులు అగ్రెసివ్‌గా ఉండే మాట వాస్తవం. అది స్థాయీ బేధాలతో కమ్యూనిస్టు సంఘాల్లోనూ దళిత సంఘాల్లోనూ ఫెమినిస్టు సంఘాల్లోనూ ఆయా సందర్భాల్లో కనిపిస్తుంది. అది వ్యవస్థను ధిక్కరించే వారిలో ఉండే ఆగ్రహం. నిలువనీటిని ధిక్కరించేవారిలో ఉండే ఆగ్రహం. అటువంటి ప్రశ్నేలేకపోతే ప్రశ్నించేవారే లేకపోతే వ్యవ్సస్థ కుళ్లిపోయి చచ్చిపోతుంది. ప్రశ్న మాత్రమే, ప్రశ్నించే గొంతులు మాత్రమే ఏ వ్యవస్థనైనా మానవీయంగా మారుస్తూ ముందుకు నడిపిస్తాయి. స్టేటస్‌కో గొంతులు కావు. కానీ వారి కళ్లలో ఆగ్రహం మాత్రమే కనిపించి ఆ ఆగ్రహానికి కారణమైన వేల సంవత్సరాల ఆకలి అవమానం కనిపించకపోవడంలో పనిచేసేది ఏ అహంకారం? వర్ణాంధత్వం కళ్లకు కమ్మితే తప్ప వాస్తవాలు కనపించకుండా ఉండడం సాధ్యమేనా! అలవాటై పోయిన అణచివేత ఇంటర్నలైజ్‌ అయిపోయి ఎరుక లేని మొద్దుతనం మెదడును ఆవహిస్తుంది. ఆ మాయా పొరలు తొలగించుకుని వాస్తవాన్ని గ్రహించాలంటే ఏ మనిషికైనా ఒకటే విలువ అనే ప్రజాస్వామిక దృక్కోణం అవసరమవుతుంది..
టీచర్లకు విద్యార్థుల పట్ల ఉండాల్సిన దృక్పథం ఏమిటి? గ్రామీణ పేద దళిత బహుజనులు ఇలాంటి సంస్థల్లో ప్రవేశం పొందడమే కష్టమైన విషయం. సంప్రదాయ అర్థంలో అయినా టీచర్‌ వారికి మార్గదర్శనం చేసేవారిగా ఉండాలని చెపుతారు. వారి మంచి చెడులు చూడగలిగే సంరక్షలుగా ఉండాలని చెపుతుంటారు. టీచర్‌ తండ్రిలాంటివాడు అని సంప్రదాయ వాదులు కూడా గంభీరంగా సెలవిస్తుంటారు. సంరక్షకులు చేసే పనేనా ఇది? ఇక్కడ జరిగిందేమిటి? సాధారణంగా హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం లాంటి వాటి పట్ల అందులో ఉండే టీచర్లకు బయటివారికి కూడా భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. అది అత్యాధునికమైన టీచర్లు, అత్యాధునిక మైన స్వేచ్ఛా వాతావరణం ఉన్నవిశ్వవిద్యాలయం అనే భావన ఉంటుంది. కొన్ని రాష్ర్ట విశ్వవిద్యాలయాల్లో ఉన్నట్టు అక్కడ కులం పేర హాస్టళ్లలోనూ టీచర్లలోనూ చీలికలు బాహాటంగా ఉండకపోవచ్చు. కులం ఇతర విశ్వవిద్యాయాల్లో మాదిరి బండగా ఆపరేట్‌ చేయకపోవచ్చు. అందువల్ల మా దగ్గర అ లాంటి వాతావరణం ఉండదండీ అని సులభంగాఅనేస్తుంటారు.. చాలామందినిజంగా నమ్ముతుంటారు కూడా. కానీ బాహాటంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌గా కనిపించే చోట కంటే కనిపించకుండా అంతర్గతంగా సోఫిస్టికేటెడ్‌ రూపాల్లో పనిచేసేచోటనే ఆలోచనాపరులు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. దాన్ని గుర్తించి దాంతో తలపడడానికి లోచూపు అవసరం. ఇపుడు రోహిత్‌ ఆ ముసుగును కూడా చించేసి కుల్లం కుల్లా చేసి వెళ్లాడు.
ఇతర విద్యార్థి సంఘాలకు బయట అండగా నిలబడే పెద్ద సంస్థలుంటాయి. కష్టనష్టాలను పంచుకోవడానికి ,అవసరమైనపుడు ఆవేశం పాలు తగ్గించి ఆలోచన పాలు పెరిగేలా చేయడానికి అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి.. దళిత ఉద్యమం దారితప్పి కనిపించకుండా పోయిన మాట వాస్తవమే కావచ్చు. తమకు ఎవరూ లేరు అనే భావనలో దళితవిద్యార్థి సంఘాలు పడిపోయేలా అది కొంతవరకు పనిచేసి ఉండొచ్చు. కానీ హిందూత్వ రాజకీయాలను వ్యతిరేకించేవారు, అంబేద్కర్‌ కులనిర్మూలనా భావజాలంతో మౌలికంగా ఏకీభావమున్న పురోగామి శక్తులు బయట చాలామందే ఉన్నారు. అనేక రూపాల్లో ఉన్నారు. అనుసంధాన ప్రక్రియలో ఎక్కడో లోపం జరిగింది. లేకపోతే విద్యార్థులు ఒంటరితనం ఫీల్‌ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం వచ్చి ఉండేది కాదు. క్యాంపస్‌కి వెళ్లాలి అనుకుంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన మిత్రులు చాలామంది ఇపుడు గిల్టీగా ఫీల్‌ అవుతున్నారు. వాళ్లు వెళ్లడం వల్ల ఏదో జరిగిపోతుందని కాదు. బలమైన శత్రువుతో తలపడుతున్నపుడు మౌలికంగా ఏకీభవించే మనుషులు చేతులు కలపకపోవడం ఆత్మహత్యాసదృశ్యం.. సామాజిక నేరం కూడా. ఇది రెండువైపులా జరగాల్సిన పని. రెండువైపులా ఉండాల్సినంత చొరవ లేకపోవడం వల్ల ఇక్కడ కనిపించే లోపం. అంత లోతైన ఆలోచనలు ఉన్న రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడడం అంతుపట్టని విషయం. పైగా అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకున్న మనిషి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం గాని విషయం. ఆ లేఖలో మనిషి అస్తిత్వం కుదించబడడం వంటి పదాలు చూశాక ఉన్న భారాలకు తోడు తాత్విక ఏకాకితనం కూడా ఆవహించిందా అనిపించొచ్చు . కానీ అవేవైనా సంక్షుభిత సందర్భంలో మనిషి చిక్కుకున్నపుడు అదనంగా పనిచేసే అంశాలు తప్పితే వాటికవి కారణాలు కాలేవు-మన వాతావరణంలో. వాటిని చర్చించడానికి ఇది సందర్భం కూడా కాదు. కానీ దుర్మార్గమైన అణిచివేత బారిన పడి ఒక మనిషి ఒంటరైపోయి తన చావుతో కదలిక తీసుకురావాలని అనుకోవడం మాత్రం అందరి ఫెయిల్యూర్‌ కిందే లెక్క. రోహిత్‌ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక విషయాన్నైతే స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని క్యాంపస్‌లలో రగిలే గుండె మంటలు ఢిల్లీని బలంగా తాకుతున్నాయి. అంబేద్కర్‌ నుంచి స్ఫూర్తి పొందిన, చదువుకున్న దళిత బహుజనులు హిందూత్వకు వ్యతిరేకంగా ఏకం కాగలరని తెలియజేస్తున్నాయి. ఎన్ని కుయుక్తులు పన్నినా పురోగామి శిబిరం నుంచి లాగేసుకోవడం పరివార్‌కు సాధ్యం కాని పని. అగ్గిరాజుకుంటున్నది.. మార్క్స్‌- అంబేద్కర్‌ హిందూత్వకు సవాళ్లు విసురుతూనే ఉంటారు. రోహిత్‌ ఆత్మహత్య ఎట్టిపరిస్థితుల్లో అంగీకారం కాదు కానీ తన విషాదాంతంతో అటువంటి సవాల్‌ను అయితే విసిరివెళ్లాడు. క్యాంపస్‌లన్నింటిని ఏకం చేశాడు. ఈ ఐక్యతను కొనసాగించి ఆధిపత్య శక్తుల ఆట కట్టించడమే అతనికి మనం ఇవ్వగలిగిన నివాళి.

(మూడు రోజుల క్రితం నా క్యాంపస్‌కి వెళ్లి వచ్చిన రోజు రాసుకున్న నాలుగు మాటలు.)
జి ఎస్‌ రామ్మోహన్‌
(జనవరి 23, 2016న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌)

No comments:

Post a Comment