Monday 29 July 2013

లౌడ్‌ థింకింగ్‌

అరె
బల్లి అటు తిరిగింది
ప్రపంచమెంత చలనశీలం 
కోటలు చుట్టేస్తాం
పేటలు దాటేస్తాం
పేరు మర్చిపేయి అందర్నీ అడుక్కుంటూ ఉంటాం
గమ్యాన్ని పలవరిస్తూ దారి మర్చిపోయిన బాటసారులం కదా
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
తెలిసిందంతా తెలీనిదని తెలీకే కదా
నేలా బండా ఆడుతూనే ఉంటాం
అక్షరాలు అబద్ధాలని తెలీకనే కదా
నిర్వచనాల నడుములిరగ్గొట్టడం తెలీకనే కదా
పదాల ఉప్పు మూటల్ని తిరగేస్తూనే ఉంటాం
విశేషణమే విశేషమనుకున్నాం కదా!
దీర్ఘకావ్యం రాస్తూ వ్యాకరణాన్ని మర్చిపోయిన రచయితలం కదా1
నామవాచకం సర్వనామమయ్యే మర్మకళ ఏదో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
వెతికిన దొరుకుననుకుంటాం
తట్టిన తెరువబడుననుకుంటాం
కొండలూ కోనలూ అరణ్యాలు పర్వతాలు తిరిగేస్తూనే ఉంటాం
గరళమని అసుంటుంచిన ఆ ఓల్డ్‌ ఓడ్కాను కసిగా ఒంపేసుకుంటాం
ఏం వెతుకుతున్నామో మర్చిపోయి ఎన్నేళ్లయిందో 
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
సప్తసముద్రాలకు ఆవల మాంత్రికుడి ప్రాణమున్న చిలుక 
అందమైన ఎరో అక్షరసత్యమో
అన్వేషణ సత్యమో లక్ష్యం సత్యమో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు

జి ఎస్‌ రామ్మోహన్‌
(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక(28-7-13)లో ప్రచురితం)


1 comment:

  1. అవును దీర్ఘ కావ్యం వ్రాస్తూ వ్యాకరణాన్ని మరచిపోయిన రచయితలం కదా జి.ఎస్.రామ్మోహన్ గారూ!మోహన రాగమహో మహానందమాయే!

    ReplyDelete