Tuesday 13 December 2011

పులి జూదం








ఎంకారెడ్డి మూడోసారి పంచె సవరిచ్చుకున్నాడు. ఏం జేసినా అది నీలుక్కుని సావడం ల్యా. 'ఈనెమ్మ'... గంజి సరిగా పెట్టలేదని సాకల్ని తిట్టుకుంటా యాప చెట్టుకాడికి ఎళ్లబారినాడు.
'ఎంత గంజి పెట్టినా ఇంకా ఎన్నాళ్లొస్తది సామీ. ఎపుడో మీ కూతురు పెళ్లి నాటి పంచె. ఆడికీ శానా ఎక్కువ కాలం సేవ జేసింది'... సాకలి మాటలు గుర్తులేక కాదు. కాకపోతే అట్లాంటివి గుర్తు చేసుకోవడమంటే ఎంకారెడ్డికి బో చిరాకు.
యాపచెట్టుకాడ అప్పటికే జోరుగా సాగుతోంది పులిజూదం. సాలోళ్ల పరంధాముడి తాజ్‌మహల్‌ బీడి, బలిజోళ్ల సుబ్బారాయుడి విల్స్‌ సిగరెట్టూ పోటాపోటీగా పొగలు చిమ్ముతున్నాయి.

'ఒక ఆటెత్తు, రెండు సంపుళ్లు. మావా. నీ పులుల పని అయిపోయిందే'
'నా పులుల్ని కట్టేయాలంటే నీ జేజినాయన దిగిరావాలోయ్‌. ఇదిగో ఈ మేకను సావకుండా చూసుకో చేతనైతే'...
మాంచి ఊపులో వున్నారిద్దరూ. పరంధాముడు రెడ్డికి పలకరింపు నవ్వు యిసిరేసి కొంచెం ముడ్డి పక్కకు జరిపినాడు కూర్చోవడానికి చోటిచ్చినట్టు. సుబ్బారాయుడు కూడా నవ్వీ నవ్వనట్టు అదో రకంగా పలకరిచ్చినాడు. ఎపుడూ రానోడు ఈడెందుకొచ్చినాడీడికి? సుబ్బారాయుడెందుకో అపశకునంలాగా అనిపిచ్చినాడు రెడ్డికి. పలకరింపులు అయినాయిగానీ అటైతే ఇప్పట్లో అయ్యేట్టు కన్పిచ్చడంల్యా. ఎవురూ లేసేట్టు లేరు.
'ఆ చెవి జూదం ఆడవోయ్‌. అది.. చెవిలోకి తోయవోయ్‌ నాయాలా'
ఎంకారెడ్డి పరంధాముడి మీదకు వొంగి సలహాలివ్వడం మొదలుపెట్టినాడు.
'ఇగో మామా. పేకాట కాడ, పులిజూదం కాడ పైయోళ్ల యవ్వారం వద్దే వద్దని నువ్వే అంటివి' పరంధాముడు గుర్తు చేసినాడు.
'అది ఆడ కూచున్నప్పుడు అంటిలేవోయ్‌. పెద్ద
లాపాయింటు మాట్లాడినావ్‌గాని'
సహజన్యాయన్ని మృదువుగా గుర్తు చేసినాడు ఎంకారెడ్డి. రెడ్డి అర్యుూ యిర్యుూ మాట్లాడుతున్నాడేగాని చూపంతా పోల్రాజు టీ కొట్టు మీదే ఉంది. ఒక చేతిని ఆకాశానికి మరో చేతిని బూమికి ఆనిచ్చినట్టు టీ తిరగ్గొడతా ఉన్నాడు పోల్రాజు.

'ఇంతకీ ఈ నా కొడుకు నన్ను చూసినట్టా, చూడనట్టా. చూసినా చూడనట్టు యాక్సన్‌ జేచ్చన్నడా'...
ఎంకారెడ్డి హృదయం రకరకాలుగా ఆలోచిస్తా ఉంది. యాడ్నో కాల్తా ఉంది. అతని అవస్తను చూసి లోలోపలే వికటాట్టహాసాలు చేసుకుంటున్న పోల్రాజు ఆ ఆనందపారవశ్యాన అదాటున దొరికిపోయినాడు. చూపులు చూపులు కలిసినాయి. ఇక తప్పలేదు. చార్మినారు పాకెట్టు, కాఫీ గల్లాసు పట్టుకొని యాపచెట్టు కాడికి నడిచినాడు.
పెట్టె తెరిచిన రెడ్డికి షాక్‌ కొట్టినట్టయ్యింది. పదికి బదులు ఐదే.
గంభీరంగా ఉరిమి చూడబోయినాడు. పరిస్థితిని ముందే ఊహించిన పోల్రాజు
'బాబాయ్‌' అని పద్దుల పుస్తకం మీద చేయి వేయబోయినాడు.
'పరువు దీస్తడా యేం నా కొడుకు' రెడ్డి హృదయం గుబగుబలాడింది. గంభీరం కాస్త భయగంభీరమైంది. చివరకు దీన గాంభీర్యంగా అవతరించింది.
రెడ్డి భయం జూసి పోల్రాజుకు ఆర్గాజానుభూతమైంది.'పోన్లే పెద్ద నా కొడుకు' అనుకుంటా టీ కలపడంలో మునిగిపోయినాడు.
పరంధాముడు, సుబ్బరాయుడుతో సహా ఆడున్నోళ్లందరూ ఏమీ ఎరగనట్టు మర్యాద నటిస్తూనే అంతా గమనిస్తా ఉన్నారు రంజుగా.
రెడ్డికి వాళ్ల యవ్వారంపై అరకొరగా అనుమానమున్నా 'చీ చీ మనూరోళ్లు మరీ అంత ఎదవలు కాదులే' అని ఆ అనుమానాన్ని తొక్కేసినాడు.
ఎందుకో ఉన్నట్టుండి అతనికి
జేజినాయన అబ్బారెడ్డి గుర్తుకొచ్చినాడు.

'ఆయన గుర్రమెక్కి యాపచెట్టుకాడికి ఎళ్లబారితే ఊరు ఊరంతా గప్‌చుప్పయ్యేది. కావ్‌ అందామనుకుని నోరు తెరిసిన కాకి గూడ కా తోనే ఆగిపోయేది. యాపచెట్టు కాడ ఆయన కొలువు తీరిస్తే బోజరాజు సబ లాగుండేది గాదూ. ఎట్టాంటి రోజులయి. ఎంత గౌరం, ఎంత మర్యాద. ఆ రోజులే యేరు. దర్మం నాలుగు పాదాలా నడిసే రోజులయి. ఇట్టాంటి మిడిమాలపు రోజులా. నాన్న ఇన్నారెడ్డి మాత్రం.. బుల్లెట్‌ టపటపలాడిస్తే ఎవురైనా నోరు తెరిసే వాళ్లా. అంత దమ్ములా ఎవుడికైనా'
రెడ్డి బాధాకర మధుర స్మ­ృతులకు బ్రేక్‌ వేస్తూ ఊడిపడింది ఆర్టీసి బస్సు ఎర్రదుమ్ము లేపుకుంటా.
డ్రైవర్‌ కొండయ్య బుయ్‌ బుయ్‌మని రెండుసార్లు ఆరన్‌ మోగిచ్చి బస్సు దిగి పోల్రాజు దగ్గర కూలబడ్డాడు. కండట్టర్‌ ఉసేను పంచాయితీ పేపర్‌ తెచ్చి రెడ్డి చేతిలో పెట్టినాడు ఆనవాయితీ పెకారం. ఉసేను నేరుగా పేపర్‌ తనకే యివ్వడం రెడ్డికి రుూరుబానతో రుూపు గోకిచ్చుకున్నంత సుఖంగా అనిపిచ్చింది. సుబ్బారాయుడ్ని చూడ్డంతోనే కలిగిన అపశకునానికి ఉపశమనంలాగా అనిపిచ్చింది. ''పర్లేదు. యింకా ఆచారాలు మిగిలున్నాయి. దర్మం అక్కడక్కడా వుంది'' అనుకొని అభినందనపూర్వకంగా నవ్వినాడు. విదురుడి కేసి క్రిష్ణ పరమాత్ముడు చూసినట్టుగా చూసినాడు ఉసేనుకేసి. ఆ తర్వాత మొదటి పేజీ వుంచేసుకొని మిగిలినవి ఉదారంగా పంచి పెట్టినాడు ఆనవాయితీ పెకారం.

'ఏరా కొండిగా! ఇంకో రెండుసార్లు ఆరనేస్తే మీ తాత ముల్లేమైనా పోతాండాదా? ఆ మూలున్న గౌండ్లోళ్ల రుూదిలోకి ఆరన్‌ యినిపించాల్నా లేదా? ఎవురెక్కకుండా ఒట్టి బస్సునే తీసకపోవాలనుకొంటాండావా?' డ్రైవర్‌ కొండయ్యను మందలిస్తా ఉన్నారు కొందరు చైతన్యపూరితులైన గ్రామస్తులు.
'ఆ ఏచ్చాలేవోయ్‌. రెండుసార్లేం కర్మ. రెండొందలసార్లు ఏచ్చాంగానీ. ఏం కాసేపు ముందొచ్చి కూర్చుంటే మీ వూరోల్ల గని ఏమైనా తరిగిపోతాండాదా?' మాటకు మాట అంటిస్తున్నాడు కొండయ్య.
ఆ ఊరికి ఒగటే బస్సు. ఒగటే పేపరు. నిన్న మొన్నటి దాకా ఒగడే నాయకుడు. ఇట్టాంటి వాతావరణంలో అక్కడికి వచ్చినాడు రామయ్య అలియాస్‌ రామశాస్త్రి. పొద్దుటాల్నే పొలాల నుంచి వస్తున్నట్టున్నాడు. చేతిలో కంచు చెంబు. దానికి పోటీగా నేరేడు పండుగాలా మిలమిలమాడుతున్న గుండ్రని పొట్ట. బుజం మీద కాశీ తువ్వాల. నడుము చుట్టూ కావి రంగు పంచె.
రామయ్య రాగానే పోల్రాజు టీకొట్లో బెంచీల మీద కూర్చున్నోళ్లంతా లేచి నిలబడినారు దండం సోమీ అనుకుంటా. రెడ్డి నమస్కారం పెట్టలేదుగానీ అంతకంటే మర్యాదగా నవ్వుతో మందలిచ్చి పేపర్‌ చేతికిచ్చేసినాడు. పరంధాముడు ఓ నమస్కారబాణం పడేసినాడు. సుబ్బారాయుడు మాత్రం వింతైన పలకరింపు ఇసిరినాడు.
'ఏం సోమీ అంతా సుఖమేనా?'
స్వామి పొట్టను, కంచు చెంబును కొంటెగా చూస్తా సుబ్బారాయుడు అడిగిన ప్రశకు మామూలుగానైతే పక్కున నవ్వులు ఇనపడాల్సిందే. అయితే ఎంకారెడ్డి యిందాకే అనుకున్నట్టు ఊరోళ్లు పెద్దా చిన్నా తెలిసినోళ్లు. ఎందుకైనా మంచిదని నవ్వును లోలోపలే దాచుకున్నారు. స్వామేం తక్కువ తిన్నాడా గాయం కనపడకుండా మొకాన్ని గాంభీర్యంతో కడిగేసినాడు. ఈరేంద్ర సెవ్వాగు పాకిస్తాన్‌ బౌలింగ్‌ను ఎట్లా ఇరగదీసినాడో పేపర్‌ ఎనకాల్నుంచి వంగి వంగి చదువుతున్న పిల్లకాయలను ఒక్క కసురు కసిరినాడు.

'పోండ్రా కుంకల్లారా!. చిన్నా లేదు. పెద్దా లేదు. ఇంతోడికి పేపర్‌ గావాల. అంతోడికి పేపర్‌ గావాల. యాడుండోడు ఆడుండేది ల్యా. ప్రతోడికి పేపర్‌ గావాల, రాజకీయాలు గావాల. కలికాల మహిమ. అయినా ఒకర్నని లాభంలేదులే. అంతా ఆడు చేసిన పని' ఎన్టీఆర్‌ను మనసులోనే కసిదీరా తిట్టుకుంటా పేపర్‌ రెడ్డికిచ్చేసి ఎళ్లబారినాడు చెంబూపుకుంటా. యిరవైఏళ్లు దాటినా గాయం పచ్చిగానే ఉన్నట్టుంది రామశాస్త్రికి.
'ఎంతైనా కర్ణపోడు కర్ణపోడే. ఆడితో చెతుర్లా' నలుగురైదుగురు చెవులు కొరుక్కున్నారు సుబ్బారాయుడుకేసి అదోరకంగా చూస్తా. తనకింకా చిటారుకొమ్మన పండును కొట్టేంత గురి రాలేదని అర్థమైంది సుబ్బారాయుడుకు.
'రెడ్డీ.. పులులు తీసుకుంటావా? మేకలా? అయినా రెడ్డివి కదా. పులులే తీసుకోలే'
గాలి ఇటు తిప్పాడు. రెడ్డికి సెలకోలతో కొట్టినట్టయ్యింది. 'ఈడు నా మీద ఔదార్యం చూపుతాడేంది?. నేను కదా అది అందరి మీద చూపాల్సింది! అది నా హక్కు గదా!' రెడ్డి మనసు మూలిగింది.

'స్వామికేమి సుబ్బరంగా జారుకున్నాడు. కానీ తనట్ల పోలేడే. ఈ యాపచెట్టు యిడిసిపెట్టలేడే. అది యిడిస్తే పాణం ఇడిసినట్టే గదా. ఈడు జూస్తే కడుపులో ఏదో కుట్రపెట్టుకొనే ఈడికి వచ్చినట్టున్నాడు. అయినా అటో యిటో తేల్చేసుకోవాల్సిందే'
దీరƒంగా నిట్టూర్చి...''నలబై ఏళ్ల నుంచి ఈ ఆటాడతాండాను సుబ్బారాయుడా. నాకేవైతేనేమిగానీ పులులు నువ్వే తీసుకో. నేను మేకలు తీసుకుంటాగాని''.. ఒక్క ఉదుటున అనేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
నక్సలైట్లూ, ఉచిత విద్యుత్తూ, బిన్‌ లాదెన్నూ తదితర ప్రపంచ సమస్యలను కూలంకషంగా చర్చిస్తున్న పోల్రాజు టీకొట్టులోని సకల జనసందోహం కూడా అరుగు చుట్టూ చేరతా వుంది. పరంధాముడి పని అటూ ఇటూ కాకుండా వుంది. యింటిలో సాపు పూర్తవడానికి రెండు గజాలు మిగిలుంది. 'ముందే పూట పూటకి కటకటగా వుంటే మగ్గం మీద కాసేపైనా ముడ్డి మోపకుండా పెద్ద పోతుమొగోని మాదిరి యాపచెట్టు కాడ పెత్తనాలేందని' పెళ్లాం పోరుతున్నా ఇదిలిచ్చుకోని వచ్చినాడు. ఈడ జూస్తేనేమో యవ్వారం బో కుశాలగా ఉంది. 'ఆ రెండు గజాలు అదే నేచ్చదిలే' అని ఆడ్నే కూలబడినాడు. ఏదో పెళ్లి పందిట్లో కాటి సీను రికార్డు మోత మోగిస్తా ఉంది. 'ఇచ్చోటనే.. ఇచ్చోటనే భూములేలు రాజేంద్రుల అధికార ముద్రికల్‌ అంతరించే' డివి సుబ్బారావు గొంతు ఆరున్నరలో ఖంగు ఖంగుమంటోంది.
మూమూలుగా సుబ్బారాయుడు యాపచెట్టుకాడికి వచ్చేవోడు కాదు. మిలట్రీ నుంచి రిటైరైనాక డ్రైవర్‌గా చేరి లారీ కొన్నప్పట్నించి ఊరులో అతని పేరు పెద్దమనుషుల లెక్కలో చేరింది. కష్టపడి చదివించుకున్న కొడుకు అమెరికా పోయి ఆడ్నించి పంపించే డాలర్లతో ఊర్లో వడ్డీ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాక యవ్వారం పూర్తిగా మారిపోయింది. ఓల్‌ మొత్తం డివిజన్‌లోనే అమెరికా కొడుకున్న ఏకైక తండ్రిగా పేరు ఎలిగిపోతా వుంది. బేస్‌మెంట్‌ నుంచి అంతా సిమెంట్‌తో టౌన్లోల్ల మాదిరి జాంజాంగా మాడీ కట్టించినాడు. బీడీలనొదిలేసి సిగరెట్టుకు మారినాడు. నాటు నుంచి సీమసరుక్కు తిరిగినాడు. ఊళ్లో వాళ్ల మాటల్లో చెప్పాలంటే 'ఇయ్యాల ఆడి ఉచ్చ పెట్రోలై మండుతా వుంది'.

'రెడ్డీ, తెలంగాణ వచ్చదంటావా?' కొండ మీంచి పులిని కిందకి దించి తొలి ఎత్తు వేసినాడు సుబ్బారాయుడు.
'వస్తే ఏముంది, రాకపోతే ఏముంది, మనకేమన్నా ఉంటదా, ఊడుద్దా' ఉషారైన జవాబిచ్చానని సంబరపడినాడు రెడ్డి.
'అదేంది రెడ్డీ, మడుసులన్నాక అన్నీ తెలుసుకోవాల. అందునా పెద్దమడుసులన్నోళ్లు అవసరమా కాదా అనుకోకుండా పేపర్లో వచ్చేయన్నీ తెలుసుకోవాల. ల్యాపోతే మనకూ మిగిలినోళ్లకూ తేడా ఏముంటది?' ఇంకో పులిని కిందికి దించినాడు సుబ్బారాయుడు.
అంతా పళ్ల బిగువున బరిస్తానే ఉన్నాడు రెడ్డి.
'మనకూ మిగిలినోళ్లకూ అని చెప్పి గుర్రాన్ని గాడిదను ఏకం జేచ్చడా? నాలుగు రాళ్లు ఎనకేసుకోగానే పెద్ద మొగోడయిపోయినాడు, అబ్బారెడ్డి జమీందారు వంశీకులతో సమానమైపోయినాడా' అని గిలగిలలాడిపోయాడు. ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టినట్టయ్యింది.
'రెడ్డీ... పివి నరసిమ్మారావు మేదావా? వాజ్పేయి మేదావా?' ఇంకో బాణం యిసిరినాడు సుబ్బారాయుడు.
ఇందాకటి అనుభవం యిచ్చిన జ్ఞానం వల్ల వెంటనే మనకెందుకు అని సమాధానమియ్యకుండా ఒకించుక దీరƒంగానే ఆలోచించినాడు రెడ్డి.
'ఎవుర్ని కాదంటామోయ్‌. ఇద్దరూ గట్టోళ్లే' నిదానంగానైనా మాంచి ధీమాగా చెప్పినాడు.
'అదేంది రెడ్డా. అట్లనేసినావు. ఇద్దరూ గడుసుపిండాలే అని నాకు తెలీకనా. ఏదో పెద్దోడివి. ఇద్దర్లో ఎవురు ఎక్కువ మేదావి అని చెపుతావనే కదా అడిగింది' అట్నుంచి నరుక్కొచ్చినాడు సుబ్బారాయుడు.

రెడ్డికి ఎటూ పాలుపోకుండా ఉంది. రెడ్డి పుటక పుట్టినాక అందులోనూ జమీందార్‌ వంశాన పుట్టినాక అవతలోడు సవాల్‌ ఇసిరితే యెనక్కు పోయేదానికే ల్యా. అట్టని అవతలోడి దగ్గర ఏమేం ఆయుదాలుండాయో తెలుసుకోకుండా రంగంలోకి దిగాల్నంటే ఎవురికైనా కష్టమే. అకస్మాత్తుగా జేజినాయన అబ్బారెడ్డి గుర్తొచ్చినాడు. ఆయన గుర్రమూ, ఆ ఠీవి... ఆలోచనలతో బరువెక్కిన తలను ఒక్కసారి ఇదిల్చినాడు. ఒంట్లో సత్తువ అంతా కూడగట్టుకుని గంభీరంగా గాలి పీల్చి 'నరసిమ్మారావే ఒక మెట్టెక్కువ' అనేసినాడు.
'ఎట్టా?' పాయింట్‌ దొరగ్గానే కోర్టులో వకీలు అడిగినట్టు గబాల్న అడిగినాడు సుబ్బారాయుడు. అప్పటికే మూడు మేకల్ని చంపేసి ఊపు మీదున్నాడు.
'ఆయన జగమెరిగిన పండితుడు, బాగా చదూకున్నోడు'
'అంటే వాజ్పేయి సదూకోలేదనా. ఆయనా బెమ్మాండంగా సదివినోడే కదా'
'ఈయన పుస్తకాలు అవీ రాసినాడప్పా. ఆయనతో పోలికెక్కడ?'
'ఆయన రాయలేదనా ఏంది? ఆయన రాసిన పాటలు మా కలర్‌ టీవీలో గూడ సూపిస్తిరే' కలర్‌ టీవిని నొక్కి పలుకుతా చెప్పినాడు సుబ్బారాయుడు. అంతటితో ఊరుకోకుండా ఏమంటావు అన్నట్టు పరంధాముడి వైపు చూసినాడు.
పరంధాముడి పని శానా ఇబ్బందిగా తయారైంది.
అటు చూస్తే ఇంట్లో సాపు తెంపినాల్నించి మళ్లీ నూలు కోసం, రంగుల కోసం సుబ్బారాయుడే గతి. ఇటు చూస్తే తరతరాల అనుబంధం. ఇస్వాసమా బోయినమా అన్నట్టుంది పరిస్థితి. ఏం చేయాల్నో తోచక అటూ ఇటూ కానట్టు కన్ఫ్యూజింగుగా నవ్వినాడు. రెడ్డికి షాక్‌ కొట్టిన ట్టయ్యింది.
'చీ ఇస్వాసం లేని నాకొడుకు' కడుపులో కసిదీరా తిట్టుకున్నాడు.
ప్రయత్నంగా కాలు మీద కాలు వేసుకున్నాడు. మీసాల మీదికి చేయి పోనిచ్చి మెలి తిప్పుతా అదనపు గాంభీర్యం కోసం ప్రయత్నించినాడు. ఏంజేసినా సుబ్బారాయుడి మొకంలో క నిపిస్తున్న దర్పానికి సమానంగా రావడం ల్యా. కరుక్షేత్రంలో కర్ణుడి మాదిరి వుంది రెడ్డి పరిస్థితి. నమ్ముకున్నవన్నీ నట్టేట ముంచి ప్రత్యర్థి ముందు తనను నిరాయుధుడిని చేస్తున్నట్టనిపించింది. అంతటి నిస్సహాయతలోనూ ఏదో మెరుపులాగా మెరిసింది.
'ఆయన బహుబాషా కోవిదుడు. ఈ విషయంలో ఎదురే లేదు'... పాశుపతాస్త్రం యిసిరినానని అనుకున్నాడు రెడ్డి. తన జవాబుకు ఎదురే లేదన్న ధైర్యంతో ఒక్కసారిగా తలెత్తి అందరి మొకాల వంకా ధీమాగా చూశాడు.

అయితే ఆ ఆనందం ఒక్క క్షణంలోనే ఆవిరైపోయింది.
'అంటే ఏంది.. చానా బాసలొస్తయనేగా. సరే అట్టయితే ఆయన కంటే నాకే ఎక్కువ బాసలొచ్చు. నేనే పెద్ద మేదావినవ్వాలి కదప్పా ఈ పెకారం' తడుముకోకుండా అనేసి ఉల్లాసంగా పెట్టెలోంచి సిగిరెట్‌ తీసి ఇలాసంగా ఎలిగిచ్చినాడు సుబ్బారాయుడు.
రెడ్డి మొకంలో నెత్తురంతా ఆవిరైపోయింది. 'ఈడు మిలట్రీ నా కొడుకని గుర్తు లేకపాయగదా' అని వగచినాడు. చుట్టుపక్కల జనం కేసి పరికించి చూసినాడు. అందరూ చూపుల్లోనూ భరించలేని జాలి.
'అయిపోయింది. సర్వం అయిపోయింది. తాతల తండ్రుల నాటి పరువును తాను నిలపలేకపోయినాడు. జమీందారీ వంశాన తాను చెడబుట్టినాడు. నిన్నమొన్నటి దాకా తువ్వాల చేత్తో పట్టుకొని నసుగుతూ నంగినంగిగా మాట్లాడే వోడి పవర్‌ ముందు తాను నిలబడలేకపోయినాడు. చేతుల్లో ఇంత పెద్ద సిగరెట్‌ పట్టుకుని ఊర్లో ఏవో పెత్తనాలు చేసుకుంటా తిరుగుతున్నాడని తెలిసె గాని ఇంత అగస్మాత్తుగా తన కోటలోకి వస్తాడని కలగంటిమా!'

జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత రెడ్డి కళ్లలో నీటిపొర కదలాడింది. అది చుక్కగా మారి కిందకి దూకకుండా ఉండడానికి అతడు తన సర్వశక్తుల్నీ కేంద్రీకరించాడు. అయితే అప్పటికే ఆ తడి అందరికీ అనుభూతమైంది. రెడ్డి కళ్లకు జనాన్ని మోసం చేసే శక్తి లేకపోయింది. దైన్యాన్ని జయించడానికి మాటలనాశ్రయించక తప్పలేదు.
కాసేపు అర్యుూ యిర్యుూ అంతూపొంతూ లేకుండా మాట్లాడినాడు. పరంధాముడితో ఒకప్పుడు నేతపని ఎంత వెలుగు వెలిగిందో చెప్పినాడు. ఊర్లో శ్రీరామనవమి రోజు తాలిబొట్టుకోసం రాములవారి విగ్రహాన్ని పరంధాముడి జేజినాయన ఇంటికి ఎట్లా ఊరేగింపుగా తెచ్చేవారో చెప్పినాడు. ఎనకటి రోజుల్లో కులవృత్తుల కున్న గౌరవం గురించి పెద్దా చిన్నా మర్యాదల గురించి అర్యుూ ఇర్యుూ మాట్లాడినాడు. కాలంలో వెనక్కు నడిచిన వాడి మాదిరిగా చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఎంతో సేపు గతాన్ని పలవరిచ్చినాడు. మనుషులను అపుడే కొత్తగా చూస్తున్నట్టు అందర్నీ వింతగా పరికించి చూసినాడు. ఆ తర్వాత హటాత్తుగా మాటలాపేసినాడు. సుబ్బారాయుడి కేసి ఒక్క చూపు యిసిరినాడు. ప్రపంచంలోని కసిని, ద్వేషాన్ని, అసహ్యాన్ని రంగరించుకున్నట్టుందా చూపు. అదిగో అప్పుడు మాత్రం సుబ్బారాయుడి ఒళ్లు జలదరించిన మాట వాస్తవం. చూపుకు అంత శక్తి వుంటుందని అతను తొలిసారిగా తెలుసుకున్నాడు.

కాసింత మౌనం తర్వాత 'వస్తానోయ్‌ పరంధాముడు' అని ఒక మాటనేసి నెమ్మదిగా ఇంటి బాట పట్టినాడు ఎంకారెడ్డి. జొరమొచ్చి వారం రోజులు ఉపాసాలు చేసిన రోజున కూడా రెడ్డి అంత నీరసంగా నడవల్యా.
మర్నాడు కూడా యాపచెట్టు యదావిదిగా కొలుపు దీరినాది. కాకపోతే అరుగు మీద రెడ్డి చార్మినార్‌ వాసనలేదు. సుబ్బారాయుడి విల్స్‌ సిగరెట్టు పొగ మాత్రం ఉంగరాలు ఉంగరాలై తిరుగుతా ఉంది.
అతడు అడక్కముందే సిగిరెట్‌ పెట్టె, కాఫీ పట్టుకొచ్చి యిచ్చినాడు పోల్రాజు. కండక్టర్‌ ఉసేను గూడ పేపర్‌ అతనికే తెచ్చివ్వాల్సి వచ్చింది.
జి ఎస్‌ రామ్మోహన్‌
(2005 జూన్‌ 11న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

No comments:

Post a Comment