Friday 9 December 2011

చిల్లర దేవుళ్లు..




మీడియాలో భక్తి ఇపుడో హాట్ టాపిక్. మంచి బాబాలు చెడ్డ బాబాల చర్చ తీవ్రం గా జరుగుతోంది. భక్తుడికి భగవంతుడికి మధ్య పుట్టుకొచ్చిన ఈ దళారులను అర్థం చేసుకోవడాలంటే 90ల తర్వాత ఉత్పత్తిదారుడి కంటే మేనేజర్లకు, దళార్లకు పెరిగిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 90ల్లో పెరిగిన కొత్త తరగతి తమకు అవసరమైన స్కూళ్లు, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్బులు, క్లబ్బులను సృష్టించుకున్నట్టే భక్తిలోనూ తనకవసరమైన దేవుళ్లను- చిల్లర దేవుళ్లను సృష్టించుకుంది. 90ల తర్వాత మనల్ని తీర్చిదిద్దే వేదికలు, తీరిక సమయాలను గడిపే వేదికలన్నీ వర్గాలవారీగా విడిపోయిన విషయం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. 

ఎవరి తాహతును బట్టి వారికి స్కూళ్లు, ఆస్పత్రులు, రెస్టారెంట్లు.. అన్నీ. వీటన్నింటితో పాటే దేవాలయాలు కూడా. 90లకు ముందు కూడా దేశంలో స్వాములోర్లున్నారు. అక్కడా ఇక్కడా బాబాలున్నారు. కానీ రజనీష్, చంద్రస్వామి లాంటి వేళ్లమీద లెక్కపెట్టగలిగినవారు తప్ప మిగిలినవారందరూ మామూలు స్వాములు. తాయెత్తులు, పసుపు-కుంకుమలు, నిమ్మకాయల బాపతు. పిల్లలు లేనివారికి, రోగాలు నయం కానివారికి ఉద్యోగాలు రానివారికి లాస్ట్ రిసార్టుగా స్వాములోర్లు ఉండేవారు. 

అది ప్రధానంగా మధ్యతరగతి వ్యవహారం కాదు. 

బాగా పైవారికి రజనీష్, చంద్రస్వామి లాంటివారుండేవారు. కింది తరగతికి ఊరికొక తాయెత్తుస్వాములోరు ఉండేవారు. 80ల్లో చాపకింద నీరులా మొదలై 90ల్లో విశ్వరూపం చూపిన వినియోగ ఆధారిత అభివృద్ధి నమూనా మన భావజాలంలో కూడా భయానకమైన మార్పును తీసుకువచ్చింది. అన్నిరంగాల్లో మధ్య దళారీలు విపరీతంగా బలపడ్డారు. భక్తిలో కూడా. భక్తి అతిపెద్ద కమోడిటీగా మారింది.

భారతీయ వాత్సాయనం, యోగా, భక్తి మార్గం విదేశాలకు ఎగుమతి అయిన పెద్ద మార్కెట్ సాధనాలు. వాస్తవానికి ఇటీవల ప్రదర్శన రూపంలో పెరిగిన యోగా-భక్తి-సెక్స్ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది.

పెరిగిన మధ్యతరగతికి పాత సాధనా లు సరిపోవు. పాత అలవాట్లు సరిపోవు. విశ్వాసానికి కొంత లాజిక్ జోడిస్తే కానీ దానికి తృప్తి ఉండదు. బలులు, నెత్తురు, కుంకుమ-పసుపు-నిమ్మకాయల వంటివి మరీ నాటుగా, మూర్ఖంగా తోస్తాయి. భక్తికోసమో ముక్తి కోసమో ఫలానా దగ్గరకు పోతున్నామని చెప్పుకోవడం మాత్ర మే సరిపోదు. ఆసుపత్రి కట్టించాడండి అనా లి. స్కూళ్లు పెట్టించాడండీ, పేదలకు సేవ చేశాడండీ అనాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేం ద్రాలుగా ఉంటే సరిపోదు. మానసిక ఉల్లాసం ఇచ్చే రిక్రియేషన్ సెంటర్లుగా ఉండా లి. 

చలువరాతి మందిరమ్ములు కావాలి. భక్తి కేవలం పరం అయితే కుదరదు. ఇహపరములను లింక్ చేసి మాట్లాడేవారు కావాలి. మెటీరియలిస్టిక్‌గా ఉంటూనే శాంతినివ్వాలి. ఒక్కముక్కలో సుఖమూ శాంతి రెండూ కావాలి. శాంతికోసం సుఖం ఒదులుకొమ్మనే 'అభివృద్ధి నిరోధక' పాత నమూనా కొత్త మధ్యతరగతికి పడే వ్యవహారం కాదు. ఈ రెంటినీ సమన్వయం చేసి బోధించే ఉపన్యాసకులు కావాలి. 

ఇన్నర్ ఇంజినీరింగ్, కాస్మోరేస్ వంటి ఆంగ్ల పదాలను కలిపికొట్టగలిగినవారు కావాలి. గిల్ట్‌ను పోగొట్టుకోవడానికి ఆశ్రయించే దేవాలయాల బదులు గిల్ట్ అవసరం లేదు అనే బాబాలు కావాలి. శాంతి కోసం కోరికలను అదుపులో పెట్టుకోవాలనే బౌద్ధాన్ని ఏనాడో తరిమేశాం (వర్తమాన వినియోగ ఆధారిత అభివృద్ధి నమూనాకు అది పూర్తి వ్యతిరేకమైనది). చేయించడం అయినా చేయడమైనా అన్నింటికీ కారకుడను నేనే అనే గీతను ఆనాడే భారతంలో చేర్చాం. ఆనాడు బౌద్ధాన్ని తరిమి కొట్టడానికి రక్తపాతం అవసరమైంది. ఇవాళ ఆ అవసరం లేదు. టీవీ ఉంది. 

ఈ మధ్యనే దేశవ్యాప్తంగా ఉపన్యాసకళలో ఆరితేరిన బాబాలు, సుఖశాంతులను ఒకే పదబంధంగా బోధించగలిగిన బాబాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చారు. ఇక్కడ కూడా ఆంగ్లం రావడం అదనపు అర్హత అయింది. చక్కటి ఆంగ్లం మాట్లాడే జగ్గీ వాసుదేవ్, రవిశంకర్ లాంటివారు బాబాల్లో క్రీమ్‌గా మారిపోయారు. భక్తి బోధనవల్ల ఒనగూరే సౌఖ్యాలతో తృప్తిపడి స్కూల్లో, ఆస్పత్రులో పెట్టుకుని ఆ రకంగా ప్రయాణం సాగించే బాబాలు కొందరైతే దీనివల్ల అధికారిక గణం తో ఏర్పడే పరిచయాలను బిజినెస్‌గా మార్చుకుని డబ్బుని రకరకాల రూపాల్లోకి మళ్లిస్తున్న బాబాలు మరికొందరు. రానురాను బాబా అనేవాడు సింగిల్ విండోగా తయారయ్యాడు. 

అతను కాంట్రాక్టులు ఇప్పించగలడు. సినిమా చాన్సులు ఇప్పించగలడు. మంత్రి పదవులు కూడా ఇప్పించగలడు. అందరూ అందుకే వెళతారని కాదు. ఫలానా ఫలానా పెద్దమనుషులే వెళ్లారు. ఏమీ లేకపోతే ఎందుకెళ్తారు అనేది గొర్రెదాటు తీరు. కోర్సు, కోడ్, డ్రెస్ అనేవి భక్తి కార్పోరేటీకరణలో కొత్తగా పాపులర్అయిన పదాలు. అయ్యప్ప వారసత్వంలో ఇపుడెన్ని దీక్షలు! ఎన్ని డ్రెస్సులు! కల్కి దీనికి భారీ ఫీజు కూడా చేర్చి పతాక స్థాయకి తీసికెళ్లాడు. భక్తి అనేది నిరంతర ప్రక్రియ స్థాయి నుంచి నిర్ణీత వ్యవధిలో చేసే కోర్సుగా మారిపోయింది. 

మొత్తంగా ఇవాళ బాబాయిజం ఒక పెద్ద ఇండస్ట్రీ. కొంతభాగం మాఫియా కూడా. మాఫియాలాగే ఇది రాబిన్‌హుడ్ ఇమేజినీ తొడుక్కోగలదు. హత్యలూ చేయించగలదు. సుఖం అనేదాన్ని వస్తువుల్లో వెతుక్కుంటూ వాటికోసం పరిగెట్టి పరిగెట్టి ఆ స్ట్రెస్ పోవడం కోసం బాబాల దగ్గరకు జిమ్‌లకు (ఆరోగ్యం కాదు, ఫిట్‌నెస్ కోసం) క్యూలు కట్టే మన మధ్యతరగతి మనస్తత్వం దీనికి ఇంధనం.

 పోయేది పెద్దగా లేనప్పుడు అందరూ చేస్తున్న దానికి భిన్నంగా ఎందుకుండాలి అనేదే భక్తి భావనలో మూలసూత్రం. బాబాయిజం దీని ఆధునిక రూపం. కాబట్టి అతనెవరో కాషాయం తొడుక్కుని రాసలీలలు చేస్తాడా, ఇతను ఆశ్రమం పేరుతో డ్రగ్స్ సప్లయ్ చేస్తాడా అని ఆవేశపడడంవల్ల ప్రయోజనం లేదు. దొరికితేనే దొంగబాబా. దొరికేంతవరకూ ఘరానా బాబానే! వీరి మూలం మన మధ్యతరగతి ఆలోచనా విధానంలో ఉంది. మన ఆశలో దురాశలో ఉంది. సారం కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆధునిక విలువల చట్రంలో ఉంది.
- జిఎస్ రామ్మోహన్
(మార్చి 31, 2010న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

No comments:

Post a Comment