Thursday, 13 March 2014

బుజ్జిపిల్ల-తెల్లపిల్ల

ఈ మధ్య ఒక పాట వినాల్సి వచ్చింది.  బుజ్జిపిల్ల, తెల్లపిల్ల, ఐలవ్యూ పిల్లా అనే పాట.  సినిమా పేరు కూడా తెలుగు సినిమావాళ్ల ఊత పదం మాదిరి ఎరైటీగా ఉంది. పోటుగాడు. వెరీ ఇంటరెస్టింగ్‌! యువార్‌ సో టైటూ, ఐయామ్‌ నాట్ వైటు, ఇట్స్‌ ఆల్‌ రైటూ అనే దివ్యమైన చరణం ఈ పల్లవిని అనుసరిస్తుంది. కొలవెర్రి తగ్గింది  కానీ పాటల శైలిపై ఆ ప్రభావం మిగిలే ఉంది. ఇది సినిమా పాట మాత్రమే కాదు. స్ర్తీలకు సంబంధించి, రంగుకు సంబంధించి మన సమాజంలో వ్యాపించి ఉన్న వ్యాధులకు దర్పణం.  భారత్‌లో కొంతకాలంగా రేసిజం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ర్టాల అమ్మాయిలమీద వివక్షగురించి లైంగిక దాడులు ఎక్కువవడం గురించి కొన్ని రోజులుగా మీడియాలో చాలా విశ్లేషణలే వస్తున్నాయి. 90ల తర్వాత ఈశాన్యం నుంచి  'మెయిన్‌ల్యాండ్‌'కు వలసలు పెరిగాయి. ఎక్కువగా సర్వీస్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  బ్యూటీపార్లర్లకు వెడితే అక్కడ మసాజ్‌ చేసేది ఎక్కువగా  వారే. హోటల్‌ రంగంలోనూ వారే. పెళ్లిళ్లలో బొమ్మల్లాగా నుంచోబెట్టేది వారినే. ఇంగ్లిష్‌ వల్ల ఆధునిక రూపమెత్తినప్పటికీ సారాంశంలో ఆదివాసీలు వారు. మనకు సేవలు చేయువారిని చులకనగా  చూచుట సంప్రదాయం. దీనికి తోడు వారు వేసుకునే దుస్తులు,  తిండితిప్పలు,  ఇతరులతో వ్యవహరించడంలో చూపే చొరవ లాంటివన్నీ కలిసి వారిపై చులకనభావం పెరిగేట్టు చేస్తున్నాయని అది నేరాలకు దారితీస్తోందని విశ్లేషణ. ఈ పోకడ కొత్తదేమీ  కాదు. పాతికేళ్ల క్రితం మన సినిమాల్లో లూసీలు, లౌసీలు రిసెస్పనిస్టులు, నర్సులుగా ఉండేవారు. మళయాళీలపై ఇలానే  చిన్నచూపు కనిపించేది. సినిమా వాళ్లు ఆ పాత్రలకు తొడిగే  చిట్టి పొట్టిగౌన్లు, ఇంగ్లీష్ కలగలపి కొట్టే తెలుగులు, అపుడపుడు వాళ్ల చేతుల్లో బ్రాందీ బుడ్లు, సిగరెట్‌ బట్లూ, వెరసి వారంటే అందుబాటులో  ఉండే సరుకు అనే చులకన. చదువుకున్న వారి భాషలో ''ఈజీ గోయింగ్ పీపుల్‌". స్టీరియోటైపింగ్‌ మనకు కొత్తదేమీ కాదు.  అవకాశముండాలే కానీ దాన్ని ఎంత వికారమైన స్థాయికైనా తీసికెళ్లగల సాధనం తెలుగు సినిమా.
     


వికార ప్రదర్శనకు   'మనం' కాకుండా ఇంకెవరో ఒక సమూహం కావాలి. మనమూ వాళ్లూ అనే పరిభాష కావాలి.
ఈ 'మనం' అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ 'మనం' ప్రాంతం అవుతుంది. అపుడు 'వాళ్లు' నేపాలీయులో ఈశాన్యం  వాళ్లో కేరళ వాళ్లో అవుతారు. హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు పరిమితం కాకుండా మన ఎక్స్‌పోజర్‌ పెరిగి ఏ ఢిల్లీలోనే నాలుగు రోజులు  ఉండాల్సి వస్తే ఈ జ్ఞానం ఇంకాస్త పెరిగి "అమ్మో పంజాబీ ఆడవాళ్లా, వాళ్లు చాలా ఫాస్ట్‌ గురూ,  ఎగేసుకుని పోతారు అని జోకొచ్చన్నమాట.  అలా కాకుండా బావి మరీ చిన్నదైపోయి జిల్లా స్థాయికొచ్చేశామనుకోండి. అపుడు 'వాళ్లు' పెద్దాపురం పాపలయిపోతారు.
పేట చిలకలయిపోతారు. కొన్ని సార్లు ఈ 'మనం' కులం అవుతుంది. అపుడు వాళ్లు భోగం వాళ్లో దళితులో అవుతారు. అయితే వ్యవస్థలో  వచ్చిన మార్పులు ఇక్కడ కులాన్ని తీసేసి మార్కెట్‌ను పెట్టడం వల్ల ఈ కోణం తగ్గిపోయింది. ఇవాళ మసాజ్‌ పార్లర్లు, రిసార్టులు, హోటళ్లమీద దాడుల్లో పట్టుబడుతున్నవాళ్లలో అన్ని కులాల వాళ్లు ఉంటున్నారు. పెట్టుబడి అక్కడ  కులాన్ని దాదాపు తీసేసింది. మిగిలిన చాలా రంగాల్లాగే ఫ్లెష్‌ మార్కెట్‌ కూడా వేరే రూపం తీసుకుంది. కాబట్టి ఈ 'మనం' అనేది కులాన్ని ఆశ్రయించడం తగ్గిపోయింది. కొన్ని సార్లు ఈ 'మనం' మతం అవుతుంది.  అపుడు 'వాళ్లు' క్రైస్తవులో ఇంకెవరో అవుతారు. ముస్లింలయితే చాదస్తులు. క్రైస్తవులైతే మరీ ఫాస్ట్‌ పీపుల్‌. మనం మాత్రమే కరెక్టన్నమాట. వి  ఆర్ ఆల్వేస్‌ నార్మల్‌. దే ఆర్‌ ఆల్వేస్ అబ్‌నార్మల్‌. అది ఎవరూ కాదనరాని గీత. కానీ పౌరుషేయమే.  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల మనలో  కాకుండా మనకు విడిగా ఉంటేనే అందరూ వికారాలు బాహాటంగా ప్రదర్శించుకోవడానికి వీలుంటుంది. ఏ లోపమైనా వికారమైనా మనలో  కాకుండా బయట చూడడం చాలా సుఖం.
ఇంతకీ ఈ గొడవకు ఈ బుజ్జిపిల్ల-తెల్లపిల్లా పాటకు సంబంధమేటి? మన లైంగిక సారస్వతంలో అమ్మాయి కన్నె పిల్లగా ఉండవలె.  అబ్బాయి ఎంత ముదురైనప్పటికీ ఇబ్బందేమీ లేదు. కన్యాదానమే చేయవలె. తొలిరేయి నెత్తురు కళ్ల చూడవలె. యువార్‌ సో టైటూ  అనే పవిత్రమైన చరణరాజంలో ఇలాంటి విషయం దాగున్నది. ఈ టైట్‌ లూజూ అనే పదాలు ఇటీవల  లైంగిక పరిభాషలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి. మన టెన్త్‌ క్లాస్‌ ప్రేమ సినిమాలన్నింటా వీటితో ముడిపడిన బూతు జోకులు, అమ్మాయి-ఆంటీ విభజనలు చాలానే  ఉంటున్నాయి. కన్యాసంభోగంతో యవ్వనం తిరిగొస్తుంది లాంటి దారుణమైన నమ్మకాలు చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ రకంగా బుజ్జిపిల్ల లాంటి రోగాలన్నీ పాత కాలపు రోగాలు.  గంభీరమైన పరిభాషలో చెప్పుకుంటే ఫ్యూడల్‌ సమాజం నుంచి  కొనసాగుతున్న రోగాలు. లైంగిక చర్యలో పొందే ఆనందంలో  దాని  పాత్ర ఏమీ ఉండదని చాలా అధ్యయనాలే తేల్చినా తలల్ని మట్టిలో పాతేసుకున్న ఉష్ర్టపక్షులు ఆపాత చూరును పట్టుకుని  వేలాడుతున్నాయి. యంగ్‌ ఫ్లెష్‌ పట్ల వ్యామోహం చిన్నపిల్లల అమ్మకాలను ప్రేరేపిస్తున్నది. భయానకమైన సెక్స్‌రాకెట్‌ను, హింసను ప్రేరేపిస్తున్నది. .  బుజ్జిపిల్లా తెల్లపిల్ల లాంటి పాటలు ఇలాంటి రోగాలను వ్యాపింపజేయడంలో వైరస్ లాంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇదొక విషవలయం. ఎప్పటికప్పుడు తిరగబెడుతున్న బుజ్జిపిల్లా అనే పాత రోగానికి తోడుగా తెల్లపిల్ల రోగం మధ్యలో వచ్చి చేరిపోయింది. అది వారసత్వపు రోగం కాదు.  పెట్టుబడి తెచ్చిన రోగం. మన సంప్రదాయ సుందరులు తెల్లనివారు కాదు. క్రిష్ణలు. మార్కెట్‌  వ్యాపింపజేసిన ఆధునిక వ్యాధి ఇది. అయితే ఫ్యూడల్‌ ఆధిపత్య లక్షణం మాదిరి ఈ ఆధిపత్యానికి ఆరాధనీయమైన లక్షణం అన్నివేళలా ఉండదు. అదొక యావ, అంతే.  ఆరాధనే నిజమైతే తెలుపే ఆరాధనీయమైతే ఈశాన్యం అమ్మాయిలు, నేపాలీ అమ్మాయిలు, ఉక్రెయన్‌ అమ్మాయిలు అంత చులకనైపోరు. ఇక్కడ ఆధిపత్యం- చులకన అనేవి మార్కెట్‌ అవసరాన్ని బట్టి మార్కెట్‌లో వారున్న స్థితిని బట్టి ఉంటుంది.  సాపేక్షకమైన తేడాలతో గ్రడేషన్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌లో వర్ణాధిక్య భావన పశ్చిమదేశాల రేసిజం కంటే ఒకింత భిన్నమైనది. ఉత్తరాది వారు అక్కడి సాపేక్షకమైన తెల్ల తోలుతో సరిపెట్టుకోలేక నేపాలీ మాసం మీదుగా ప్రయాణించి ఇటీవల సోవియెట్‌ దేశాల ఆడమాంసం కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో కూడా బలిసినోళ్లు సోవియెట్‌ శరీరాల్నే దిగుమతి చేసుకుంటున్నారు.  ఎక్కడెక్కడ తెల్లగా ఉండే నిరుపేద అమ్మాయిలు దొరికితే అక్కడక్కడకు మార్కెట్‌ పరుగులు పెడుతోంది. తెలుపు ఒక మార్కెట్‌ లక్షణం, అంతే. సహజసిద్ధంగా వచ్చే లక్షణానికి లేని ఆధిపత్యాన్ని ఆపాదించడం దాన్ని కొనుగోలు చేయొచ్చు అని అవాస్తవికమైన భ్రమల్ని ప్రచారం చేయడం మార్కెట్‌ మాయ. ఈ కొనుగోలులో సౌందర్య సాధనాలుఉంటాయి. తెల్ల ఆడశరీరాలూ ఉంటాయి. అది ఆధిపత్యానికి చిహ్నం అని భావించాక అలాంటి లక్షణం ఉన్న శరీరాన్ని పొందడం అనేది కూడా ఆ యావలో భాగమవుతుంది. బలిసినోళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తూ వాళ్లలాగే తానూ రష్యన్‌ అమ్మాయిని పొందాలన్న యావలో పడిన ఒక కుర్రాడి విషాద ఘట్టాన్ని అరవింద్‌ ఆదిగ తన వైట్‌ టైగర్‌లో అద్భుతంగా చిత్రించాడు. అందానికి తెలుపును పర్యాయపదం చేసి దాని చుట్టూ ఎన్ని వేల కోట్ల మార్కెట్‌ని అభివృద్ది చేశారో చూస్తూనే ఉన్నాం. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్స్‌ మన బానిసత్వానికి పరాకాష్ట. ఈ రోగాన్ని ఎంతగా ఇంటర్నలైజ్‌ చేసుకున్నామంటే  ఉష్ణదేశంలో నివసించే మనం, సగటు శరీర వర్ణం నలుపుగా ఉండే మనం మన సినిమాల్లో నల్లవాళ్లని బపూన్లని చేసి వారిమీద జోకులు  వేసేస్తున్నాం. నల్లవాళ్లు మెజార్టీగా ఉండే సమాజాల్లో నలుపు మీద అంత దుర్మార్గమైన క్రూరత్వం దేనికి సంకేతం? నలుపులో కూడా నికార్సైన నలుపుకు పెట్టింది పేరైన దక్షిణాదిన తమిళంలో వడివేలు, తెలుగులో బాబూమోహన్‌  పాత్రలు దేనికి సంకేతం? పార్తీపన్‌, విజయ్‌ లాంటి వారు  హీరోలుగా ఉండే తమిళసినిమా రంగంలో వడివేలు పాత్రలు అలా ఉండడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.  మన దేశంలో భూస్వామ్య సమాజం కులాధిపత్యాన్ని న్యూనతను ఎలా ఇంటర్నలైజ్‌  చేసుకున్నదో  పెట్టుబడి దారీ సమాజం వర్ణాధిపత్యాన్ని న్యూనతను అలా ఇంటర్నలైజ్‌ చేసుకుంటున్నది. మొదటిది సాంఘికపరమైన  ఆధిపత్యానికి అవసరమైన వ్యవహారం అయితే రెండోది మార్కెట్‌కు అవసరమైన ఆధిక్యభావన.
      మళ్లీ పాట దగ్గరకు వద్దాం. ఇక్కడ పాటపాడుతున్నది దక్షిణాది హీరో పాత్రధారుడు.  ఎంత తెల్ల వ్యామోహమున్నా  దక్షిణాది హీరో ఎంతో కొంత  నల్లగా ఉండక తప్పదు. హీరోలు పెట్టుబడితో సంబంధమున్నవారు, లేదా వారి వారసులు.  వాళ్లు కథానాయకులుగా ఉండడం అనివార్యం. అందువల్ల జనంలో ముఖ్యంగా అబ్బాయిల్లో  తెల్ల తోలు పట్ల ఉన్న వ్యామోహాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకోవాలి.  వాళ్లు సాధ్యమైనంత లిబరల్గా ఒళ్లు చూపించేవాళ్లై ఉండాలి. వాళ్లకు మిల్కీ బ్యూటీ లాంటి కుర్రాళ్లను ఊరించే పేర్లు పెట్టాలి. ప్రదర్శన అనేది యుగలక్షణమైన కాలంలో ఉన్నాం కాబట్టి 'అందాల్ని' ప్రదర్శించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇట్సే మార్కెట్‌ నీడ్!  ఆస్తులైనా అందాలైనా ప్రదర్శించుకోకుండా మార్కెట్‌ చేసుకోలేని దశ ఇది. అయితే శరీరం చూపించడంలో లిబరల్‌గా ఉండగలిగే వాళ్లందరూ నటించడంలో లిబరల్‌ ఉండలేరు కాబట్టి ఆ పాత్ర నామ్‌కే వస్తే అయిపోవాలి. నాలుగైదు పాటలు, రెండు రోమాన్స్‌ సీన్లు వగైరాలకు పరిమితం కావాలి. మనమెలాగూ ఉన్నట్టుండి రంగు మార్చుకోలేం కాబట్టి యువార్‌ సో టైటూతో పాటు ఐయామ్‌నాట్‌ వైటూ, ఇట్స్‌ ఆల్‌ రైటూ అని లిబరల్‌గా అనేయొచ్చు. అక్కడ మనలాంటి హీరో ఒకడు తెల్లతెల్లగా ఉన్న చిన్నఅమ్మాయి మీద అక్కడా ఇక్కడా చేతులు కాళ్లూ వేస్తూ వికారాలు చూపిస్తా ఉంటే అదేదో మనమే చేస్తున్నట్టుగా మన యువత ఆనందించే వీలుండాలి. ఈ తెల్లతోలు వ్యామోహం వల్ల తొలుత తెలుగులోనూ ఇపుడిపుడే తమిళనాట కూడా ఉత్తరాది తారలు దూసుకుపోతున్నారు. స్థానిక అమ్మాయిలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. మన హీరోల వయసును, రంగును ఎంత మేకప్‌తో నైనా పూర్తిగా మార్చలేం కాబట్టి వారి సరసన చిట్టిపొట్టి తెల్లతెల్లని అమ్మాయిలను తెచ్చిపెట్టి వారి ఒళ్లు చూపించుట, వారి ఒంటిని వర్ణించుట, అందులో లైంగికపరమైన టిటిలేటింగ్‌ భాషను ఉపయోగించుట అవశ్యమన్నమాట. ఈ అడ్డదారి మార్కెట్‌  ఇప్పటికే  స్థిరీకృతమవుతున్న దుర్మార్గమైన విలువలను మరింత పెంచిపోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మన సినిమా ఈ సాంస్కృతిక కాలుష్యవాహికగా పనిచేస్తున్నది. దానికి సూచికే  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల. సాంస్కృతికంగా మన మహిళలు మోస్తున్న రెండు పర్వతాలకు పోలిక. కాదంటారా!
(మార్చి 6, 2014న సారంగ వెబ్‌ మ్యాగజైన్లో ప్రచురితం. 'సంవేదన' అనే కాలమ్‌ ఆరంభ వ్యాసం)

Friday, 14 February 2014

అరవింద్‌ కేజ్రీవాల్‌ దేనికి సంకేతం?

అవినీతి లేని రాజకీయ నాయకులు ఈ దేశానికి కొత్త కాదు. గాంధీ, నెహ్రూ, శాస్ర్తి, మురార్జీ దేశాయ్‌ దాకా వెళ్లనక్కర్లేదు. వర్తమానంలోనూ ఉన్నారు. త్రిపుర నుంచి ఒరిస్సాదాకా తూరుపు ముఖ్యమంత్రులందరూ వ్యక్తిగతంగా మచ్చలేనివాళ్లే. మధ్యభారతం నిండా వాళ్లే. 'చావల్‌బాబా' రమణ్‌సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లకు ఆ మచ్చ లేదు. చివరాకరికి మోదీని కూడా పాపులర్‌ అర్థంలో అవినీతిపరుడని అయితే అనలేం. మరి కేజ్రీవాల్‌ ఇంత క్రేజీగా ఎందుకు మారారు? బుగ్గకారు వద్దనుకునే వారు, అట్టహాసపు భద్రతలు కోరుకోని వారు ఈ దేశానికి కొత్త కాదు.  చైనా యుద్ధంలో ఓటమి తర్వాత జనం నెహ్రూను చుట్టుముట్టి దాదాపు దాడిచేసినంత పనిచేసిన దృశ్యాన్ని, ఆ ఫొటోను ఒకసారి గుర్తు చేసుకోండి. మొన్నమొన్న రక్షణ మంత్రికి భద్రత అవసరం అని ఇంటిముందు సెక్యూరిటీ గేట్‌ పెడితే ఫెర్నాండెజ్‌ విసురుగా దాన్ని విసిరి బయటవేసిన దృశ్యం గుర్తు చేసుకోండి. ఆ చివర ఎర్రని మాణిక్‌ సర్కారు నుంచి ఈ చివర కాషాయ పారికర్‌ దాకా చాలామంది హడావుడికి దూరంగా ఉండాలని కోరుకునేవారే! సింప్లిసిటీనే వాల్యూ అయితే మమతా బెనర్జీని విస్మరించగలమా! మరి కేజ్రీవాల్‌ ఇంత క్రేజీగా ఎందుకు మారారు? పాలనలోకి వచ్చిన వెంటనే ప్రజోపయోగ పథకాలను అమలు చేసినవారు ఈ దేశానికి కొత్తకాదు. ఎక్కడిదాకానో పోనక్కర్లేదు. ఇందులో మనమే ముందు! ఎమ్జీఆర్‌, ఆయన బాటలో ఎన్టీఆర్‌ అమలు చేసిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, వైఎస్‌ చేపట్టిన ఉచితవిద్యుత్, ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ పథకాలు ఇవాళ కేజ్రీవాల్‌ చేపట్టిన బిజిలీ, పానీ పథకాల కంటే విస్తృతమైనవి. ఒక అర్ఠంలో విప్లవాత్మకమైనవి కూడా!మరి కేజ్రీవాల్‌ ఎందుకింత క్రేజీగా మారారు?

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక చిత్రమైన కాంబినేషన్‌. ఆ కాంబినేషన్ పేరు భిన్నత్వం‌. ఏదో ఒక అంశంలో కాదు. ఆ భిన్నత్వం అన్నింటా కనిపిస్తుంది. మేం సంప్రదాయ రాజకీయ నాయకుల కంటే భిన్నమైనవాళ్లం అనేది ఆమ్‌ ఆద్మీ అస్ర్తం. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే అవినీతికి భిన్నం. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే హడావుడికి భిన్నం. ప్రజలతో సంబంధాల్లో భిన్నం. వేషభాషల్లో, వ్యవహారశైలిలో భిన్నం. అరవింద్‌ ఖద్దరు మాత్రమే కాదు, బ్రాండెడ్‌ బట్టలు కూడా వేయరు. అన్నిరకాలుగా బ్రాండ్‌ అంబాసిడర్ ఆఫ్‌ అన్‌బ్రాండెడ్‌ లైఫ్‌ అనదగిన మనిషిలాగా ఉంటారు. ఎక్కడా నాయకుడు అనే ఇమేజ్‌లోకి ఒదగడు. మన పక్కింట్లో స్కూటర్‌ మీద క్యారేజ్‌ పెట్టుకుని ఆపీస్‌కి వెళ్లే ఉద్యోగి వలె ఉంటారు. అమోల్‌ పాలేకర్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అనేది సింబాలిజం. తెలుగు సినిమా వారి లాగా కేవలం మేం డిఫరెంట్ అని అంటేనే జనం నమ్ముతారా! ఇక్కడ ఆయన వెనుక ఉన్న, ఆయనను అందలమెక్కించిన రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
అన్నా హజారే లోక్‌పాల్‌ ఉద్యమం కేజ్రీవాల్‌ను ఢిల్లీ వాసులకు పరిచయం  చేసిన మాట వాస్తవమే. నాయకుడిగా జనంలోకి వెళ్లడానికి అవసరమైన ముఖపరిచయం దాంతో ఆయనకు లభించిన మాట వాస్తవమే. కానీ ఈ పాక్షిక సత్యాలేవీ కేజ్రీవాల్‌ పరిణామాన్ని పట్టించలేవు. వ్యక్తి కేంద్రకమైన విశ్లేషణలు పరిణామాన్ని అర్థవంతంగా వివరించలేవు. ఏఏ సమూహాలు తమ నాయకుడిగా కేజ్రీవాల్‌ను చూస్తున్నాయి, ఎందుకు చూస్తున్నాయి అనేది ప్రధానమైన అంశం. 1990ల తర్వాత మధ్యతరగతి తన సైజ్‌ పెంచుకుంటూనే ప్రివిలేజెస్‌ కోల్పోతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు పోయాక రికమెండేషన్ అనే రూపం అంతరిస్తూ వస్తున్నది. ఎమ్మెల్యేల ఇంటి ముందు ఇంతకుముందులాగా క్యూలు కట్టడం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దైనందిన సంబంధాలు తగ్గాక ఇతరత్రా చిన్నచిన్న రూపాల్లోని అవినీతి తగ్గిపోతూ వస్తున్నది.  ఓ వందో రెండొందలో ఇచ్చి పనిచేయించుకోగలిగిన రూపాలు ఇపుడు బాగా తగ్గిపోయాయి. జనన, మరణ పత్రాలు, ఓటర్‌, ఆధార్‌ కార్డుల లాంటి వ్యవహరాలు మినహాయిస్తే ఇతరత్రా రూపాల్లో ఇవాళ ప్రభుత్వంతో ప్రజలకు నేరుగా సంబంధాలు లేవు.  సంఖ్య తక్కువున్నపుడే ప్రివిలేజ్‌ పనిచేస్తుంది. సంఖ్యతో పాటు పోటీ పెరిగినపుడు అది ఆర్డర్‌ కోరుకుంటుంది. ఆర్డర్‌ సాంకేతిక రూపంలోకి బదిలీ అయి రైల్వేలో ఇంతకుముందులాగ అవినీతి కనిపించడం లేదని సంబరపడే స్థితి వస్తుంది. గ్యాస్‌ ధరతో పాటు సప్లయ్‌ పెరిగి అందుకోసం కొంతమంది చేతులు తడపాల్సిన స్థితి తప్పిపోతుంది. ప్రభుత్వ రంగంలోంచి ఎదిగిన మధ్యతరగతికి ప్రైవేట్‌ రంగంలోంచి ఎదిగిన మధ్యతరగతికి తేడా ఉంటుంది. 90ల తర్వాత పెరిగిన మధ్యతరగతి చాలా తొందరగా టాక్స్‌పేయర్‌ భాష నేర్చేసుకుంటుంది. తన రక్తమాంసాలు పిండి కట్టించుకుంటున్న పన్నులు బడా పారిశ్రామిక వేత్తల బొక్కసాలకు అక్రమంగా తరలిపోతున్నాయనే బాధ మధ్యతరగతికి ఇటీవల తీవ్రంగా పెరిగింది. అదే సమయంలో పాలకులు అడ్డదిడ్డంగా పేదలకు, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతున్నదనే బాధ కూడా పెరిగింది. ఈ రెండు బాధలూ మన మీడియాలో ప్రతిరోజూ డిజిటల్‌ డాల్బీ సౌండ్‌లో వినిపిస్తా ఉంటాయి. వారి బాధను తమ బాధగా మార్చుకున్న మీడియా ఈరెండు విషయాల్లోనూ దూకుడుగా ఉంటుంది. అదే సమయంలో మొదటి బాధ మరీ ఎక్కువైతే అభివృద్ధి కుంటుబడే ప్రమాదముందనే వాదనను కొందరి నోటి గుండా వినిపిస్తూ ఉంటుంది. రెండో బాధను నేరుగా వ్యక్తీకరిస్తే పేదలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం గొంతు మార్చి సబ్సిడీలు లబ్ధిదారులకు చేరడం లేదని పక్కదారి పడుతున్నాయని మాట్లాడుతుంది. రెండువైపులా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాలకులు కూడా అటూ ఇటూ బ్యాలెన్స్‌ చేయలేక అందర్నీ సంతృప్తి పరిచడానికి నానా విన్యాసాలు చేస్తున్నారు. ప్రకృతి వనరులను తమ క్లాస్‌కు కట్టబెట్టడంలోని అవినీతి బయటపడినపుడు కొంతమంది హైప్రొఫైల్‌ వ్యక్తులను జైళ్లలో వేయడం దగ్గర్నుంచి ఇటు ఆహార భద్రతా పథకం లాంటి పథకాలను పేదలకోసం వండి వడ్డించడం దాకా అటూ ఇటూ దరువేస్తూనే ఉన్నారు. అవినీతి ఆరోపణలకు భయపడి ప్రాజెక్టుల విషయంలో పట్టిపట్టి వ్యవహరించడం వల్ల అభివృద్ధి, దానికి సంకేతమైన జిడిపి దెబ్బతిన్నాయనే వాదనతో తలలు పట్టుకుంటూనే ఉన్నారు. మధ్యతరగతిలోనూ ఆ భావన రకరకాలుగా ఉంది. పాలన కనుక సక్రమంగా చేయగలిగితే రంధ్రాలను పూడ్చగలిగితే అభివృద్ధి వేగం కొనసాగిస్తూనే టాక్స్‌ మనీని సద్వినయోగం చేయొచ్చనే భావనను కొంతకాలంగా పెంచుతూ వచ్చారు. డెలివరీ సిస్టమ్స్‌లో పందికొక్కులను దూరంగా ఉంచగలిగితే న్యాయం జరుగుతుందనే భావన బలపడింది.  ఇది కాకుండా ఇంకో ఆవేదన ఉంది. 90ల తర్వాత రాజకీయాలు మధ్యతరగతికి పూర్తి దూరంగా వెళ్లపోయాయి. పేదరికం కొంత తగ్గించి జనాల కొనుగోలు శక్తి పెంచగలిగినప్పటికీ కొత్త ఆర్థిక విధానాలు అసమానతలను అన్ని రకాలుగా అమానవీయంగా పెంచేశాయి. ముఖ్యంగా రాజకీయ తరగతి పూర్తి ప్రత్యేక తరగతిగా మారిపోయింది. వ్యాపారాలకు రాజకీయాలకు తేడా చెరిగిపోయింది. తమ తమ వ్యాపార సామ్రాజ్యాలను పెంచుకోవడానికి అధికారాన్ని సాధనంగా వాడుకునే ధోరణి పెరిగింది. రాజకీయాల్లో అవినీతి ఉండొద్దని అంతా మాట్లాడతారు గానీ రాజకీయ నేతలు వ్యాపారాలు చేయకూడదని ఒక్క నేతా మాట్లాడలేరు. దిగ్విజయ్‌ సింగ్ ఆ మధ్య అలాంటి మాట గొణిగినట్టుగా అన్నారు కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకున్నవారు లేరు. అంతగా రాజకీయాలు వ్యాపారాలు కలగలిసి పోయాయి. సామాన్యుడికి పూర్తి దూరంగా వెళ్లిపోయాయి. వ్యక్తిగత నిజాయితీ వేరే. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన నాయకుల్లో నిజాయితీపరులు ఇప్పటికీ ఉన్నారు. సమూహ లక్షణం ముందు వ్యక్తుల మంచిచెడ్డలు పనిచేయవు. ఇంతకుముందు విద్యార్థి సంఘాల ఎన్నికలనుంచో ట్రేట్‌ యూనియన్లనుంచో కొద్ది మందైనా మధ్యతరగతి రావడానికి ఆస్కారముండేది. ఇవాళ ఎన్నికల ఖర్చు, అక్కడున్న హడావుడి మధ్యతరగతి అటువైపు తొంగి చూడడానికే ఆస్కారం లేకుండా చేశాయి. ఓటు వేయడం మినహాయిస్తే ఇతరత్రా రూపాల్లో పాలనా పరంగా తన గొంతు వినిపించే అవకాశాన్ని మధ్యతరగతి పూర్తిగా కోల్పోయింది. ఈ కోపం  మధ్యతరగతికి తీవ్రంగా ఉంది. ఇటువంటి సమయంలో జిందా తిలిస్మాత్‌ లాగా వచ్చినవాడు అరవింద్‌ కేజ్రీవాల్. వాళ్ల ఆశలకు రూపమిచ్చినవాడు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈ పరిస్థితి ఇవాళ ఇప్పటికిప్పుడు తయారైందేమీ కాదు. చాలాకాలంగా మధ్యతరగతిలో ఇటువంటి అభిప్రాయాలు పెరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఏదైనా ప్రయోగం జరిగినా ఇది అయ్యేదికాదు, పొయ్యేది కాదు అనేభావన ఉంటుంది. ఆ ముద్ర పడకుండా ఇది అవగలదు అనే నమ్మకాన్ని కలిగించడంలో ఆమ్‌ ఆద్మీ సక్సెస్‌ దాగుంది. మైగ్రేంట్‌ మిడిల్‌క్లాస్‌ కేంద్రీకృతమై ఉండే ఢిల్లీ, టీవీ కెమెరాలు-గొట్టాల ప్రభావం ఎక్కువగాఉండే ఢిల్లీ అతనికి ఫెర్టైల్‌ గ్రౌండ్‌ లాగా ఉపయోగపడింది.
పూర్తిగా మధ్యతరగతేనా! బస్తీలు కూడా అతనికి ఓటేశాయి కదా, దాని సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది. అక్కడ ఆయన వ్యవహారశైలి, డ్రెస్‌, మొహల్లా మీటింగ్స్ అన్నీ ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఆయన టక్కు టెక్కుగా మొకం గంభీరంగా పెట్టుకుని నేను చెపుతున్నాను, మీరు వినాలి అనే బాపతు కాదు. డబ్బులోనూ అధికారంలోనూ తనకంటే పెద్దవారితో వ్యవహరించేపుడు దూకుడుగా కనిపిస్తాడు. ఉపన్యాసకుడిగా కనిపిస్తాడు. బస్తీ సమావేశాల్లో వినయంగా కనిపిస్తాడు. శ్రోతగా కనిపిస్తాడు. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ ప్రచారాన్ని గమనిస్తే కనిపించే అంశమిది. ఎన్నికల గుర్తు చీపురు కూడా ఆమ్‌ఆద్మీకి దగ్గరకావడానికి తనవంతు సాయం చేసింది.  పైపెచ్చు కరెంట్‌ చార్జీలు సగానికి సగం తగ్గించడం, అన్ని ఇళ్లకు 666 లీటర్ల నీటిని సప్లయ్‌ చేయడం అనే మాటలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ పేదలను ఆకర్షించగలిగిన వ్యవహారాలు. ఇతను 'మేధావి' అనే ముద్ర పడకుండా చూసుకున్నారు. మనకోసం రోడ్డెక్కే వ్యక్తి, మన కోసం పెద్దపెద్దోళ్లను ఎంతమాటైనా అనగలిగిన వ్యక్తి అనే రెబెల్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. ఇది చిన్నవిషయమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ గందరగోళ విధానాల వల్ల అటూ ఇటూ విసిగిపోయి పొలిటికల్‌ క్లాస్‌ మీద పెంచుకున్న కోపానికి ఒక రూపునిచ్చారు. పొలిటికల్‌ క్లాస్ లోనికి ఎంట్రీపాయింట్‌ లేక మధ్యతరగతి పడుతున్న వేదనకు సమాధానంలాగా ముందుకొచ్చారు. ఆయనలో లేని కమ్యూనిస్టును చూసి తిట్టిపోసేవారైనా, ఆ తానులో ముక్కే అనే తేల్చపడేసేవారైనా పరిస్థితిని పూర్తిగా అర్థంచేసుకుని తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కాదు. పొలిటికల్‌క్లాస్‌కి ఆయనొక హెచ్చరిక. కొత్త ఆర్థిక వ్యవస్థ భారత్ లో బలపడిందని కొన్ని ప్రాంతాల్లో దాని తాలూకు భావజాలం పూర్తి స్తాయిలో ఆవరించి అది ఆర్డర్‌ కోసం వెతుక్కుంటోందని అనుకోవచ్చు. మార్కెట్‌ విస్తరణకు కూడా కొన్ని సమయాల్లో ఆర్డర్‌ అవసరమవుతుంది. అవినీతి అనేదే దానికి అడ్డుకట్టగా మారితే దాని ప్రదర్శిత రూపాలను రద్దు చేసుకోవడానికి అది సంశయించదు. స్థూలమైన అర్థంలో ఉత్పత్తి మెరుగుపడుతున్నప్పటికీ సప్లయ్‌ చెయిన్స్‌, డెలివరీ సిస్టమ్స్‌ మరీ నాసిరకంగా ఉన్న తరుణాన జయప్రకాశ్‌ నారాయణ్‌ సంపూర్ణక్రాంతితో ముందుకొచ్చారు. ఉత్పత్తితో పాటు సప్లయ్‌చెయిన్స్‌ కూడా మెరుగుపడి డెలివరీ-డిస్ర్టిబ్యూషన్‌ ఘోరంగా ఉన్న తరుణాన అరవింద్‌ కేజ్రీవాల్‌ అవతరించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే కాలం కడుపుతో ఉండి కేజ్రీవాల్‌ను కన్నది. ఈ పార్లమెంటరీ తిరుగుబాటు దారుడి అవతారం ఎంతకాలం ఉంటుంది అనేది వేరే సంగతి. మేం అన్నింటిలోనూ భిన్నం అనే ఇమేజ్‌ని అరవింద్‌ బృందం ఎంతకాలం కాపాడుకోగలదు అనేది ఇపుడు ఆసక్తికరమైన అంశం.
జి ఎస్‌ రామ్మోహన్‌(ఆంధ్రజ్యోతి-8-1-2014)

Tuesday, 7 January 2014

సుబ్బక్క సుప్రభాతం

"నా బట్టల్లారా..నా సవుతుల్లారా
మీ ముక్కులో నా సాడు బొయ్య
మీ చేతిలో జెట్ట బుట్ట
మీకు గత్తర తగల
మీ తలపండు పగల
మీ వొంశం మీద మన్ను బొయ్య......."
సుబ్బక్క సుప్రభాతంతో పల్లె రెక్కలిప్పుకుంది.
చేతుల్తో మట్టి ఎత్తెత్తి బోస్తా శాపనార్థాలు పెడతా ఉంది. రామాలయం మైకులోంచి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గొంతు మంద్రంగా వినిపిస్తా ఉంది. దాన్ని డామినేట్‌ చేయడానికా అన్నట్టు సుబ్బక్క అరిచి అరిచి గసపెడతా ఉంది. కళ్లాపి ఇసురిసురుగా చల్లతా ఉంది.
"ఏందే పొద్దు పొద్దునే బిగిన్‌చేసినావ్‌....ఊళ్లో అందరికి సావొస్తా ఉంది. నీకు రావడం లేదే..."
చెంబు తీసుకుని బయలుకు బోతావున్న ఎంగట్రాముడు నడక తగ్గిచ్చి పెద్దరికం చూపిచ్చినాడు.
"తిన్నదరక్క సొయ్యం బట్టి కొట్టుకుంటా ఉంటి నాయనా...ఊరోళ్ల ముల్లెంతా మూటగట్టుకుని మిద్దెలు, మాడీలు కడ్తినాయనా...అందుకే సావొస్త లేదు"...
మాంచి రెస్పాన్స్‌ ఇచ్చి మళ్లీ తిట్ల పనిలో పడింది సుబ్బక్క.
"నీ నోట్లో నోరుబెట్టి బతికిందెవడే" అనేసి ఎంగట్రాముడు నడకలో వేగం పెంచేసినాడు.
సుబ్బక్కకు ఐదుగజాల దూరంలోనే తలకాయొంచుకుని ముగ్గేస్తున్న సుజాత అంతా జాగర్తగా గమనిస్తా ఉంది. ఎదిరింటి వాకిట్లో యాప్పుల్ల నములుతా సుబ్బారాయుడు జరగబోయే వినోదం కోసం ఎదురుచూస్తా ఉన్నాడు. ఆయన భార్య రాములమ్మ పేడకాళ్లు తీస్తా ఉంది గానీ మనసంతా ఇక్కడే ఉంది.  తలకాయొంచుకున్న సుజాతనే మద్దెమద్దెలో తలతిప్పి జూస్తా ఉంది.
"యా పూటన్నా ఒకరింటికాడ చేయి జాపితినా..ఒకరి సంగిటిముద్దకు ఆశపడితినా...పెతి నాబట్టకు నా యవ్వారమే, పెతి లంజెకి నా ఇంటిమీద కన్నే...మీ కుదురు నాశనం కాను"....
సుబ్బక్క డోస్‌ పెంచేసింది.
"ఏందే బాసిలా...పిల్లోళ్లు ఎవరో ఆడుకోడానికి పిడికెడు సిమెంట్‌ తీసకబోతే ఇంత గత్తర జేయాల్నా లేకిముండా"..తగులుకొనింది సుజాత. లంజె అనే పదం ఇనిపిచ్చేసరికల్లా ఆ ఆడబిడ్డకు రోసం వచ్చేసింది. అదే సుబ్బక్క కోరుకునేది. అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట.
"అది పిడికెడా..ఎవురే లేకిది...పొరుగింటి సొమ్ముకు ఆశపడేది ఎవురే"...సిమెంట్‌బస్తాను అరుగుమీంచి లాగిలాగి చూపిస్తా ఉంది సుబ్బక్క.
"ఒరే సుబ్బరాయుడా!..నువ్వు జూడ్రా..ఇది పిల్లోళ్లు తీసకపోయినట్టు ఉండాదిరా..మాటనేదానికి ఇంగితం ఉండాల....నా సవితి, ఇపుడు తేలాల...నా సిమెంట్‌ దెంకపోయిందెవరో తేలాల...ఆ లంజెవరో లంజెకొడుకెవరో తేలాల"...
అనవసరంగా ఇరుక్కుంటి గదరా అనుకున్న సుబ్బారాయుడు "నాకెందుకులేత్తా!..మీ ఆడోళ్ల యవ్వారాలు" అని నోరుకడుక్కోవడానికి బోరింగ్‌ దగ్గరకు బోయినాడు.
"లేస్తే లంజె అంటాండావు, ఎవురే లంజె, నువ్వే లంజె, నీ ఆరికట్ల వంశమే లంజె వొంశం" అని సుజాత కొంగుబిగిచ్చి ముందుకు దూకింది. వీధి వీధంతా తమాస జూడ్డానికి తయారైపోయింది. జాలాడి బండకాడ పెచ్చులూడిపోతే రాత్రి సిమెంట్‌ తీసుకునిపోయిన సుజాత మొగుడు శ్రీనివాసులు ఇంట్లోంచి తల బయటకు పెట్టింది ల్యా.
తాగిన మత్తులో సిమెంట్‌ అవసరమైన దానికన్నా నాలుగు పిరికిళ్లు ఎక్కువ తీసుకుని దారిలో పోసి ఇపుడు సుజాతను బోనులో నిలబెట్టిన పాపానికి మంచంలోనే అటూ ఇటూ దొర్లుతూ ఇంట్లోంచే ఈదిరామాయణం చూస్తా ఉన్నాడు.
ఊరోళ్లకు సుబ్బక్క యవ్వారం కొత్తదేమీ కాదు గానీ దగ్గరిళ్లోళ్లకు మాత్రం నాలుగైదు రోజుల్నించి ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. 'కొడుకు దగ్గరకు పోయొచ్చినాల్మించి మళ్లీ దీనికి రోగం తిరగబెట్టిందేమే' అని పక్కింట్లో ఎంగటేసులు ఒగటే ఆశ్చర్యపోతా ఉన్నాడు.  'మొన్న మొన్నటి దాకా నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది, నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది అని తప్పెటేసుకుంటా తిరిగిన ముండకి ఇపుడేమైంది' అనేది అర్తం కాకపాయె.  'పెళ్లికి అందర్నీ హైదరాబాద్‌ తీసుకుపోయి రయిక గుడ్డలు గూడక పెడితిరి..ఇపుడేమాయె దీనికి' అని బీడితాగతా పొగలు పొగలుగా ఆలోచిస్తా ఉన్నాడు.
       హైదరాబాద్‌లో కొడుక్కి ఉద్యోగమొచ్చినాల్మించి సుబ్బక్క నెమ్మదిచ్చిన మాట వాస్తవమే. ఇల్లు బాగు చేయిచ్చుకోవడం, బేల్దారిని పిలిపిచ్చుకోవడం, రంగులేయిచ్చుకోవడం...బో కుశాలగా ఉండింది. మొగుడు పోయినాక సుబ్బక్కలో అంత నెమ్మది చూడడం అదే తొలిసారి. అవసరమున్నా లేకపోయినా ఇరుగింటికి పొరుగింటికి పోయి పనుల్లో చెయ్యేసేది. కొడుక్కి వచ్చిన బ్యాంకి ఉద్యోగం గురించి అడిగినోళ్లకు అడగనోళ్లకు వర్ణించి వర్ణించి చెప్పేది. ఊరోళ్లంతా ముసిల్దానా నువ్వు ఆడిదానివి కాదే, మొగరాయుడివే అంటుంటే పొంగిపోయేది. ఎవురైనా పొగుడుతుంటే బో సిగ్గుపడేది. సుబ్బక్క సిగ్గు పడగలదని ఊరోళ్లకి తెలిసిందపుడే. సర్కారీ నౌకరంటే సామాన్యమా!  లంచమివ్వకుండా ఏ ఎమ్మెల్యేతో చెప్పిచ్చుకోకుండా సుబ్బక్క కొడుక్కి ఉద్యోగం రావడమనేది ఊరోళ్లకి ఎంత బుర్ర చించుకున్నా అర్తమయ్యే విషయం కాదు.  సుబ్బక్క ఆ అద్భుతాన్ని సాధించింది.
'నువ్వేమన్నా చెయ్యి నాయనా....నువ్వు సర్కారీ నౌకరి కొట్టాల..మనల్ని చిన్నతనంగా చూసినోళ్ల ముందు మొగోడివై మీసం తిప్పాల'. అని ఒగటే తారకమంత్రం బోధించింది. అతను కూడా అర్జునుడు పక్షి కన్నునే చూసినట్టు రేయింబవళ్లు ఉద్యోగాన్నే కలవరచ్చి కోచింగులు అవీ తీసుకుని పరీక్షలు అవీ రాసి కొట్టేసినాడు. సర్కారీ నౌకరయిపోయినాడు. ఊరిలో మొనగాళ్ల జాబితాలో చేరిపోయినాడు. అంతటితో ఆగిందా! ఆడు ఆడ్నే ఎవర్నో ఆడపిల్లను చూసుకున్నాడని తెలిసి ఏడెనిమిది లక్షలు పోయెగదరా బగమంతుడా! అని నాలుగైదు రోజులు బో బాధ పడింది సుబ్బక్క. ఉత్సాహమంతా నీరుగారిపోయి ఇరుగూ పొరుగుకు మొకం చూపిచ్చలేక యమ యాతన పడింది.  మామకు ఒగతే కూతురని, కొడుకుల్లేరని తెలిసి నిదానిచ్చింది. "కులమింటి కోతినే చేసుకుంటున్నాడమ్మో..ఏమో అనుకునేరు" అని ఇల్లిల్లూ తిరిగి వివరణ ఇచ్చింది.
బంధుబలగం అంతా పోయిం తర్వాత ఆ సింగిల్‌బెడ్‌రూం ఇంటి యవ్వారం చూసి కొత్త జంటకు అడ్డుగా ఉండడం మర్యాద కాదని వచ్చేసింది. రెండు నెలలు ఉగ్గబట్టినాక కజ్జికాయలు, బూందీ లడ్లు చేసుకుని ఎగురుకుంటూ పోయింది.

...............................................................................................................
కజ్జికాయలు, బూందీలడ్లు చూసి కోడలు మొకం చిట్లిచ్చుకున్నా సుబ్బక్క పెద్దగా ఏమీ అనుకోలే. పట్నమోళ్లు ఇంగేమైనా నైసుగా జేసుకుంటారేమోలే అనేసుకుంది.
"మా ఊళ్లో అందరూ పామాయిల్‌తో చేసుకుంటారు.  నేనియ్యన్నీ సెనగనూనెతోనే చేసినానమ్మ!. మంచి బలం. తినాల. పెళ్లయిన కొత్తలో ఇట్టాంటియన్నీ తినాల!"....
ఏవో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కోడలికి అవేవీ వినడం ఇష్టం లేదని అర్థమై సైలెంటయిపోయింది. సుబ్బక్క గడబిడగా ఏదో మాట్లాడాలని అనుకుంటా ఉంటది. కోడలు పెద్దగా మాట్లాడదు. అన్నీ మొకం చూసి అర్తం చేసుకోవాల్సిందే.
"ఈడ నీళ్లు బాగున్నాయమ్మాయ్‌..మా వూర్లో అన్నీ సవ్వ నీళ్లు" అని ఇక్కడున్న సానుకూల అంశాన్ని ముందుకు నెట్టి మరోసారి మాట కలపాలని ప్రయత్నించింది సుబ్బక్క.
"మంజీర గదా, బానే ఉంటయ్‌"...అనేసి పక్కకు తిరిగి పనిమనిషికి ఏదో పురమాయిస్తూ బిజీ అయిపోయింది కోడలు. ఆ మాట తీరు కానీ హఠాత్తుగా బిజీగా మారిపోయిన తీరుగానీ ఇంకొక మాటకు అవకాశం లేకుండా చేశాయి. సుబ్బక్కకు సుర్రుమంది. కానీ తమాయించుకుంది.
ఆరోజు మద్యాన్నం సుబ్బక్క అలవాటు చొప్పున రొంటినున్న మూటలోంచి ఆకొక్క తీసి నమిలేసి రెండు పెదాలపై రెండు వేళ్లు పెట్టి గేట్‌మీదుగా వీధిలోకి ఉమ్మింది. ఖండాంతర క్షిపణి కంటే వేగంగా ప్రయాణించే పదార్థమది! ఆ సౌండ్‌ ప్రత్యేకం. కోడలు ఒక్కసారిగా తలతిప్పి చూసింది. అసహ్యం రంగరించిన చూపు.
'ఏందిమే! నేనేమన్న లంజెతనం జేసిన్నా..దొంగతనం జేసిన్నా...ఏందీ బాసిలి ఈ మంతున జూస్తది' అనుకుంది సుబ్బక్క. ఊరికే అనుకోవడమే గాకుండా ఆ మాటల్ని బయటకే అందామనుకుని నోరు తెరవబోయింది. కోడలు ఈ లోపు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దడేల్‌మని తలువేసుకుంది. అత్త ఎంత వేగంగా ఆకొక్క ఊసేయగలదో కోడలు అంత వేగంగా తలుపు వేసేయగలదు.
రోజూ వచ్చే దానికంటే ఒక అరగంట ముందే వచ్చినాడు కొడుకు. మంటలనార్పే ఫైరింజన్‌లాగా వచ్చినాడు.
"అట్లా బజార్లోకి ఊస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా...ఇదేమైనా మనూరనుకున్నావా....అంతగా నమలాలనిపిస్తే ఇంట్లో వాష్‌బేసిన్‌ఉంది కదా..అందులో ఉమ్మేయ్‌"..అని సలహా ఇచ్చేసినాడు...ఇబ్బందికరంగా మసులుతూ కోడలివైపు అపాలజిటిక్‌గా చూస్తూ. ఆ చివరి వాక్యాలు కోడలికి నచ్చలేదని ఆ పిల్ల మొకం చూస్తే అనిపిస్తా ఉంది. దానికంటే కూడా కొడుకు కోడలికేసి అట్లా చూడడం సుబ్బక్కకు అర్థం కాలా. ఏ మొగుడైనా పెళ్లాందిక్కు అట్లా చూడడం ఆమె చూసి ఎరగదు.
మర్నాడు పొద్దున్నే పళ్లుగూడా తోముకోకుండా కోడలు కాఫీ తాగుతుంటే సుబ్బక్క కాసేపు గిజగిజలాడింది.
"స్నానం చేసి పూజ చేసి నోట్లో ఏదైనా ఏసుకోవాలమ్మా...పాసినోటితో తాగడం మంచిది కాదమ్మా".. అనునయంగా  పెద్దరికం చూపిచ్చింది.
"చూడండి అత్తయ్యా!..ఎవరి అలవాట్లు వారివి. మీ అలవాట్లు మీవి. మా అలవాట్లు మావి. మిమ్మల్ని మారమంటే మారతారా"...
కోపంగా చెప్పినట్టు లేదు. గయ్యాలి తనం అస్సలే లేదు. అలాగని సౌమ్యంలేదు. వినయం మాటెత్తడానికే లేదు. స్థిరంగా ఉంది. కరుగ్గా ఉంది. మారుమాట మాట్లాడేందుకు వీలులేకుండా ఉంది. ఇక చాలు, ఊరుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఉంది. మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ రకం గొంతు సుబ్బక్కకు తెలీనిది. ఈ పట్నపు నీళ్లలో ఏదో తేడా ఉంది అనుకుంది సుబ్బక్క.
'చిన్నప్పటినుంచి మాటలు పడుడే. ఆ మొగుడు నాబట్ట  కాలితో చేత్తో  ఊర్కూర్కినే తన్నేది. మొగుడు పోయినాల్మించి ఊరోళ్లంతా ఏడిపిచ్చి చంపేది. చిన్నప్పటినుంచి ఒకరి మాట తాను వినడమే. తనమాట ఒకరు వినడం ఎరగదు. ఇంత కాలానికి ఒక కోడలు పిల్ల వచ్చింది. నాలుగు మాటలు చెప్పొచ్చు. కొంచెం పెద్దరికం చూపొచ్చు' అనుకుని ఆశపడింది. "ఓసే ఎడ్డిదానా ఆడికి పోయి ఏం మాట్లాడతావో ఏమో" అని అందరూ అంటా ఉంటే అదమ్మాయ్‌..ఇదమ్మాయ్ లాంటి నైస్‌ మాటలు కూడా నేర్చుకోని వచ్చింది. ఈడ యవ్వారం చూస్తే తేడాగా ఉంది.
సుబ్బక్కకు కుడి కన్ను అదిరినట్టుగా అనిపిచ్చింది. ఆకొక్క తోనే యవ్వారం తెలిసొచ్చినా ఏదో ఒక ఆశతో ఉండింది. ఇపుడదీ పోయింది. 'ఇది తన పెద్దరికానికి తలొగ్గే రకం కాదు. ఊర్లో తెలిస్తే ఎంత నామర్దా. పరువు తుట్టాగా పోదూ!'
"ఊపుకుంటా పోయింది ముసిల్ది. కోడలి చేత ముడ్డిమీద తన్నిచ్చుకుని ముంగిమాదిరి వొచ్చింది"...ఇరుగు పొరుగు అనబోయే మాటలు ఇపుడే వినిపిస్తా ఉన్నాయి సుబ్బక్కకు.
మర్నాడు మరో ఎపిసోడ్‌. సాయంత్రం వక్క అయిపోతే వాచ్‌మన్‌పెళ్లాం దగ్గర అడిగి తీసుకుని అక్కడే ముచ్చట్లలోకి దిగింది సుబ్బక్క. కోడలికి  తల కొట్టేసినట్టయ్యింది. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తన అత్తగార్ని ఆ స్థితిలో చూసిందని తెలిసి కోడలికి మరీ మరీ మండుతా ఉంది. మర్నాడు పొద్దునే అత్తను తీసికెళ్లి చందన బ్రదర్స్‌లో రెండు మాంచి కోకలు కొనిచ్చి ఈడున్నన్ని రోజులు అవే కట్టుకోవాలని చెప్పేసింది. "ఏందో అనుకున్నా గానీ కొంచెం మంచిపిల్లే" అనుకునింది సుబ్బక్క. ఇంటికి చేరాక వాచ్‌మెన్‌క్వార్టర్‌ దగ్గరకు వెళ్లకూడదని, వెళ్లినా వారితో సమానంగా కూచ్చొని కబుర్లు చెప్పకూడదని కోడలు మెత్తగా చెప్పేసింది. అపుడు అర్తమైంది కోడలు కొత్త కోకలెందుకు కొనిచ్చిందో!
దేవాలయానికి పోయొచ్చేసరికి స్టవ్‌మీద ఏదో సుర్రుమంటా ఉంది. ఏందా అని చూడబోతే కొడుకు ఉల్లిపాయలు తరిగి తాలింపు వేస్తా ఉన్నాడు. "ఏందిరా ఈడు ఆడంగి పనులు చేసేది" అని మనసు గింజుకుంది. కోడలు స్నానానికి పోయింది అని అర్తమైపోయింది.
"నీ పెళ్లాం జలకాలాడతా ఉంటే నువ్వు వంట చేస్తా ఉండావా, నువ్వు లే..నాయినా..నేజేస్తా గానీ, మొగోడివి నువ్వు చెయి కాల్చుకోవాల్నా......అది నీళ్లు పోసుకొనొచ్చి వంట చేస్తే కందిపోతాదా...ఇంత సదువుకుని ఏం పనిరా ఇది" అని చేతిలో గంటె లాగేసుకుంది.
"నువ్వుండమ్మా...చిన్నచిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా...క్యారేజ్‌ రెడీ కాకపోతే ఆఫీసుకు లేటయిపోదూ"...
"ఏందిరా ప్రతిదానికీ దాన్ని ఎనకేసుకురావడమేనా... అప్పుడే పెళ్లాం బెల్లం అయిపోయిందా నాయనా"
కొడుకు పని అటూ ఇటూ గాకుండా తయారైంది. భార్య ఎక్కడ ఈ మాటలు వింటుందో, ఎక్కడ అత్తా కోడళ్ల యుద్ధం బద్దలవుతుందో అని భయం. పైగా కోడలికి కచ్చితంగా వినపడాలనే తల్లి గొంతు పెంచి మాట్లాడుతున్నట్టు అర్తమవుతూనే ఉంది. అతనసలే బహు జాగ్రత్తపరుడు. సాయిబాబా భక్తుడు. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు.
కోడలికి సుబ్బక్క మాటలు వినపడ్డాయో లేదో తెలీదు. ఆమె అనుమతి లేకుండా ఆమె మొకంలో ఏ భావమూ పలకదు. వచ్చేసి వంటలో మునిగిపోయింది గంభీరంగా.
సుబ్బక్కకేమీ అర్తం కాలా. ఎదుటి మనిషి గొంతు పెంచి గొడవపడితే తడాఖా చూపించొచ్చు. కానీ ఇట్లా ఉంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. కానీ అంతకంటే కూడా ఆమెకు కొడుకు యవ్వారమే అంతుపట్టకుండా ఉంది. కోడలి కేసి కొడుకు కేసి మార్చి మార్చి చూసింది. కొడుకు చూపులు నేలమీదకు దించేసుకోని వంటగదిలోంచి బయటకు పోయినాడు.
'ఎట్టాంటోడికి ఎట్టాంటోడు పుట్టినాడు! ఆ నాబట్ట ఎపుడన్నా ఇటున్న చెంబు అటు పెట్టినోడా...సుట్టకాల్చుకోవడానికి అగ్గిపెట్టె అడిగితే ఆడ్నే ఉంది అని చెప్పిన పాపానికి "ఏం తీసిస్తే అరిగిపోతావే లంజె" అని యీదంతా తిప్పితిప్పి కొట్టలా"....చచ్చిపోయిన భర్త గుర్తొచ్చి లోలోపల మెలిపెట్టింది. గతం తవ్వుకున్న కొద్దీ ఏడుపొస్తా ఉంది. కోడలిమీద యాడలేని కోపం తన్నుకొస్తా ఉంది.
తొలిరోజే కోడలు పిల్ల రెండు సార్లు అన్నం వండాల్సి వచ్చింది. మనుషులు అంత అన్నం తింటారని కోడలికి తెలీదు. సుబ్బక్క అన్నాన్ని గురుగులాగా చేసుకుని పైన ఇంత పప్పేసుకుని ఇంతింత ముద్దలు కళ్లకద్దుకుని లాగిస్తా ఉంటే చూస్తా ఉండేది. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండేది కాదు. మూడో రోజూ కోడలు కళ్లలో అదే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం సుబ్బక్క కంట పడకుండా ఉండాలనే పట్టింపు కోడలికేమీ లేదు.
వాళ్లు తినే తిండి కూడా సుబ్బక్కకు ఆశ్చర్యమే. రెండు పిరికిళ్ల అన్నం. అంతే సైజులో రెండు మూడు రకాల కూరలు. ఆ కొంచెం తిని మనుషులు ఎట్లా బతుకుతారో ఆమెకు అర్తం కాని విషయం. మౌనంగా ఉండడానికి ఆమె కోడలు పిల్లలాంటిది కాదు.
" ఇట్ట తింటే ఎట్ట!...తినాల నాయనా.. రాళ్లు తిని రాళ్లు అరిగించుకునే వయసు. బాగా తినాల." అని ప్రేమ చూపిచ్చబోయింది.
"మీ లాగా తినాలంటే కష్టమండి. మేం చేసే పనికి అదే ఎక్కువ" అంది కోడలు పిల్ల.
"అంత కొంచెం కూరేసుకుని అంతంత అన్నం తినేయకూడదమ్మా. కూరగాయలు బాగా తినాల. అన్నం ఎంత తింటామో కూర అంత తినాల. నిజానికి కూరే ఎక్కువ తినాలంట. డాక్టర్లు అదే చెప్పేది". రివర్స్‌ జ్ఞానబోధలోకి దిగాడు కొడుకు.
'నోరు లేవాల్సినపుడు లేవదు గానీ ఇపుడు దాని మాటకు తాళమేయడానికి మాత్రం తయారైపోయినాడు' లోలోపల కాలిపోతోంది సుబ్బక్క.
"ఏమోలే నాయన! ఇంత సంగటిమీద ఊరుమిడి ఏసుకుని తినిన ప్రాణం. ఇపుడు మారాలంటే యాడ మారేది!" ....మొకం అదోలా పెట్టి మాటల్ని ఈటెలు చేసి విసిరింది.
పేరుకు నాయనా అన్నా ఆ విసురు కోడలిమీదే అని తెలుస్తానే ఉంది.
"చిన్నప్పటినుంచీ కుదార్తంగా కూచ్చొని తిన్నది లేదు. ఇపుడు తిందామంటే కుదరకపాయె. అది తింటే బిపి. ఇది తింటే సుగర్. ఆ డాక్టర్ నాబట్టదగ్గరకు పోయొచ్చినాల్మించి సప్పిడి బతుకయిపోయె. కోడలు పిల్ల మరీ అన్యాయం. ఉప్పు లేదు,కారం లేదు..నోరు సప్పగా చచ్చిపోయింది.  రుచీ పచీ లేకుండా ఇదేం తిండో అర్తమే కాదు"....తనలో తాను మాట్లాడుకోవడం నేర్చేసుకుంది సుబ్బక్క.
ఊళ్లో ఆ ఇబ్బంది ల్యా. తల తిప్పితే ఎవురో ఒకరు. ఎవురితో మాట్లాడాల్సినయి వాళ్లతో. ఈడ ఎవురికెవురు!
 ఎవురితో మాట్లాడకుండా ఉంటే నోరు పూర్తిగా చచ్చిపోయి మూగిదాన్నైపోతానేమో అన్నంత భయమొచ్చేసింది సుబ్బక్కకు. వాచ్‌మెన్‌భార్యతో ముచ్చట్లొద్దని కోడలి ఆర్డర్‌. ఇంకెవురితో మాట్లాడేది! అదేందో, అందరూ తలుపులేసుకునే ఉంటారు జైల్లోమాదిరి! ఇది ఏమి బతుకురా బగమంతుడా! అని సుబ్బక్క ఎన్ని సార్లు అనుకునిందో చెప్పలేం.
బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు.
"అమ్మొక్కతే ఏం చేస్తాది,  తీసుకుపోదాం" అన్నాడు కొడుకు.
కోడలు నోరు తెరిచింది లేదు. కొడుకు దాన్నే అంగీకారంగా అన్వయించేసుకుని అమ్మా "నువ్వు కూడా తయారవు" అనేసినాడు. కోడలిది అనాంగీకారంగా అర్తమైన సుబ్బక్క "ఎందుకులే నాయినా...ముసల్దాన్ని యాడికొచ్చేది, మీరు పోయిరాండి" అనేసింది. ఇట్లన్నా రిమోట్‌కంట్రోల్‌ చేతికొస్తుందేమో,ఈ పూటన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ చూడొచ్చేమో అని లోలోపల ఆశపడింది.
"లేదమ్మా..పోయేది గుడికే. సాయిబాబా దేవలానికి ..రా..చాలా బాగుంటది, చూద్దువుకానీ" చిన్నపిల్లలకు తాయిలం ఇస్తున్నట్టు ఊరించే గొంతుతో చెప్పినాడు కొడుకు.
గుడి అనేసరికల్లా సుబ్బక్క మనసు మారిపోక తప్పలే. ముసిలోళ్లుగా ఉండి దేవలానికి రమ్మంటే రాకుండా ఉంటే ఏమైనా ఉంటదా! సరేలే నాయనా అని బయలు దేరింది.
"ఎంత బెమ్మాండంగా కట్టినారురా...అబ్బో అబ్బో" అని సుబ్బక్క అదే పనిగా ఆశ్చర్యపోతానే ఉంది. మురికి కాళ్లు అడుగు పెట్టదగిన ఆలయంలాగా లేదది. అక్కడికొచ్చిన వాళ్లందరిలో తనలాంటి మనిషి తానొక్కతే ఉన్నానని అర్థమైపోయిందామెకు. "ఇది సదువుకున్నోళ్లు, పెద్దపెద్దోళ్లు వచ్చే దేవలం. తన లాంటోళ్లది కాదు" అని అర్తమైపోయింది.
గుళ్లోంచి బయటకు వచ్చింతర్వాత మొగుడూ పెళ్లాం గునా గునా మాట్లాడుకోవడం, ఇట్నించి ఇటే ఎక్కడన్నా బయట తినేసి ఇంటికిపోదాం అని కొడుకు ఎనౌన్స్‌మెంట్ ఇచ్చి చట్నీస్‌కి తీసుకుపోవడం అన్నీ ఒక పథకం ప్రకారం జరిగిపోయినాయి. ఈ దండగమారి హోటల్‌ప్లాన్‌ తన కోడలిదే అయ్యుంటాదని సుబ్బక్క అనుకునేసింది. ఆ చట్నీస్‌ అనే హోటల్‌లో కూడా తన లాంటి మనిషి తనొక్కతే ఉన్న విషయం, ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తున్నట్టున్న కోడలి చూపులు అన్నీ సుబ్బక్కకు అర్తమవుతానే ఉన్నాయి. కోడలు ఇడ్లీ దోసెతో సరిపెట్టేసుకుంది. సుబ్బక్క, సుబ్బక్క కొడుకు భోజనం కానిచ్చేసినారు. భోజనం తెచ్చిచ్చినోడు ఒక పుస్తకం లాంటిది పెట్టేసి దూరంగా చూస్తూ నిలబడినాడు. అందులో కొడుకు  రెండు అయిదొందల రూపాయల నోట్లు పెట్టినాడు. హోటల్‌వాడు మళ్లీ పుస్తకం తెచ్చిస్తే కొడుకు అందులోంచి ఒక్క వంద రూపాయల నోటు మాత్రం తీసుకుని మిగిలింది ఉంచేసినాడు. అన్నింటినీ సుబ్బక్క ఇచ్చిత్రంగా చూస్తా ఉంది.
"ఎంతయినాదిరా" అని అడిగింది గేట్లోంచి బయటపడగానే.
అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉంది. అడక్కపోతే పొట్ట పగిలిపోయేట్టు ఉంది. కొడుకు ఏదో మాట్లాడబోయేంతలో....
"ఎంతయితే ఏమిట్లెండి" అని అడ్డుపడింది కోడలు పిల్ల.
"అన్నింటికి నువ్వు అడ్డమొస్తావేందిమే...మొగోడు మాట్లాడుతుంటే మద్దెలో మాట్లాడొచ్చునా...ఇదేం పద్దతమ్మాయ్‌..నీకు నీవాళ్లు పద్దతి సరిగా నేర్పిచ్చినట్టు లేరు"...సుబ్బక్క అసలు అవతారంలోకి వెళ్లిపోయింది. కొడుక్కి విషయం అర్తమైపోయింది.
"నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు కదా అని గౌరవమిచ్చి మాట్లాడితే మావాళ్లగురించి మాట్లాడతరేంటి.....అయినా మీకెందుకివ్వన్నీ"....పక్కనున్న మనుషులకు వినపడకుండా లోగొంతుకతో అయినా గట్టిగానే ఇచ్చింది కోడలు. ప్రపంచంలోని చిరాకు అసహ్యం అంతా రూపమెత్తినట్టు ఉంది ఆమె ముఖం.
హోటల్‌ బయట ఎక్కడ సీన్‌ క్రియేట్‌అవుతుందో అని కొడుకు గడగడలాడుతూ ఉన్నాడు. అతనసలే గొడవలంటే ఇష్టపడని మనిషి. దేనిమీదైనా ఒక వైఖరి తీసుకోడమంటే అతనికి మా చెడ్డ చిరాకు. సిగరెట్‌తాగని, మందు కొట్టని తనలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం ఆ సాయినాధుడు ఎందుకు తెచ్చిపెడతాడా అని అతను ఆలోచిస్తా ఉన్నాడు. మౌనంగానే అంతా ఇల్లు చేరుకున్నారు. అక్కడ కొడుకు మొకం చూసి ఇబ్బందిని అర్త చేసుకుని మర్యాద కాపాడడానికి తమాయించుకుంది సుబ్బక్క. రగిలే బడబాగ్నిని దాచుకున్న అగ్ని పర్వతం ఇంటికి రాగానే లావా చిమ్మడం మొదలెట్టింది.
"అయినా ఏందిరా నీ పెళ్లాం! నేను దాన్నేమయినా అంటినా..నిన్ను కదా అడిగితి. మద్దెలో అడ్డమెందుకు రావాల. అయినా మగోడు మాట్లాడుతుంటే ఆడది మద్దెలో వచ్చేదేందిరా...అయినా నేనేమంటి... ఎంతయిందిరా అని అడిగితి" గాలి పీల్చుకోవడానికన్నట్టు ఓ క్షణం ఆగి కోడలి వైపు చూస్తూ అంది.....
"అదే తొమ్మిదొందలు పెడితే నాకు నెల గడిచిపోతుంది గదరా ఊళ్లో"
"మీ ఊరువేరు, ఇది వేరండి. ఎక్కడి పద్ధతులక్కడ ఉంటాయి. మమ్మల్ని కూడా మీలాగే బతకమంటారా"..
కోడలి గొంతు ఎపుడూ లేనంత ఆవేశంగా ఉంది. శరీరం వశం తప్పుతున్నట్టు ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌.
"మా లాగా మీరెట్ట బతుకుతరమ్మా....నువ్వు మహారాణివైపోతివి...నీ మొగుడొక మహారాజైపోయె. నీ మొగుడిలాగా నా మొగుడు ఉద్యోగస్తుడు కాదే. మట్టి పిసుక్కునేటోడు. కడుపు మాడ్చుకుని తినీతినక ఎంత జాగ్రత్తగా ఒక్కో రూపాయిని కూడబెడితే  నాయనా..నువ్వు డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదిచ్చింది? రూపాయి వచ్చినపుడు దాచిపెట్టుకోవాల నాయనా! ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా.... దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు ...రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!"..
కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.
ఇంటిదగ్గర నేర్చుకుని వచ్చిన అమ్మాయ్‌..లాంటి నైసు మాటలు మాయమై ఒరిజినల్‌ పూర్తిగా బయటికొచ్చేసింది.
కొడుకు ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్నాడు. మధ్యమధ్యలో కొద్దిగా తలపైకెత్తి కోడలి ముఖం వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. కొడుకు యవ్వారంతో సుబ్బక్కకు మరీ మంటెత్తింది.
"ఆడంగి నా కొడుకు పుట్టినావు కదరా...ఆయన ఎట్టుండేటోడు". భర్తను గర్వంగా గుర్తు చేసుకుంది.
"నోరెత్తనిచ్చేటోడా...నోరెత్తితే ఎగిచ్చి ఎగిచ్చి తన్నేటోడు కాదు!"....
"మొగోడ్ని నేను మాట్లాడుతుంటే మధ్యలో నోరెత్తుతావే ముండా"....భర్త ఉగ్రస్వరూపం గుర్తొచ్చి బొటాబొటానీళ్లు కార్చేసింది సుబ్బక్క.
"మొగోడంటే అట్టుండాల. అయినా ఆడదాన్ని నోరెత్తనీయొచ్చునా! మొగోడంటే ఎట్టుండాల...పౌరుషముండొద్దూ. ఆడదాన్ని మాట్లాడనిస్తే మొగోడికి గౌరవముంటదా!"
కొడుకుతో మాట్లాడుతుందో, తనలో తానే మాట్లాడుతుందో తెలీనట్టుగా మాట్లాడేస్తూ ఉంది సుబ్బక్క.
స్టాచ్యూ అన్నట్టు నిలబడి పోయి చూస్తా ఉంది కోడలు పిల్ల. అత్తగారి ప్రవాహం చూశాక ఆపడానికి తన శక్తి సరిపోదని అర్థమైపోయింది. మధ్యలో ఆవేశం తెచ్చుకొని ఏదో మాట్లాడబోతే కళ్లతోనే వారించాడు కొడుకు. ఉడికిపోతా ఉంది. తట్టుకోలేకపోయింది.
"చీ..ఎదవగొడవ...ఎదవ మొకాలు" అనేసి విసురుగా లోపలకుపోయి దడాల్న తలుపేసుకుంది.
"ఏం మాటలయి..ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు" ...కొడుకు తలుపు వైపు తిరిగి అరిచినట్టుగా గొణుగుతున్నాడు.
"ఎవురే, ఎదవ మొకాలు". ....ముక్కు చీదడం ఎక్కువ చేసింది సుబ్బక్క.
"నువ్వు జమీందారీ బిడ్డవి అయిపోతివి. ఉద్యోగస్తుడైన నాబిడ్డ, నేను ఎదవ మొకాలమైపోతిమి. ....ఏం మొగోడివిరా నువ్వు. అదట్లా నోరేసుకుని మాట్లాడుతుంటే"...ఆ రూట్లో నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది సుబ్బక్క.
ఎవురు నోరేసుకుని మాట్లాడుతున్నారో అర్థం కానట్టు నిలబడి..."ఎందుకిమ్మా చిన్నదానికి ఇంతగొడవ" అని ఏవో సణుగుతూ నుంచున్నాడు కొడుకు. అతనసలే గొడవలంటే పడని మనిషి.
"కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడే  నా కొడుకు నిన్ను! పది పదిహేను లచ్చలొచ్చేయి నా చిన్నాయన మనుమరాలిని చేసుకొనుంటే! ఎట్లుండేది అది! ఎంత మర్యాదగా ఉంటదది! నీలెక్కన పోలేరమ్మలాగుంటదా! ఎంత మర్యాద, ఎంత మన్నన! ఈడు నా మాటిని దాన్ని చేసుకునుంటే నాబతుకిట్టయ్యేదా!"
"ఆ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఖర్చే ఐదులక్షలయ్యింది మా డాడీకి. ఊరికే వస్తుంది కదాని బస్సేసుకుని ఒక మందని దింపారు ఇక్కడ. పెళ్లిని జాతర జేశారు".. కోడలు తలుపు వెనకనుంచే అరుస్తోంది..
యవ్వారం ఎట్నుంచి ఎటుపోతోందో అర్థం చేసుకున్న కుమారరత్నం "అమ్మా..అవన్నీ తవ్విపోయకు. చిన్నదానికి రాద్దాంతం చేసేస్తున్నావు. ఇపుడేమైందని, ప్రశాంతంగా ఇంత తిని ఉండొచ్చు కదా, ఎందుకియ్యన్నీ నీకు" అని అసహనంగా అనునయించాడు.
"పెద్దామె ఏదో అంటే నువ్వు మళ్లీ మాట్లాడాల్నా...కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది!"..తలుపు వైపు తిరిగి అటువైపు చెప్పాల్సింది అక్కడ చెప్పేసాననుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
"ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను" ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క.
తలుపు వెనుకనుంచి కోపంతో నిస్సహాయతతో బుసలు కొడుతోంది కోడలు. "లేబర్‌ మనుషులు, లేబర్‌ బుద్ధులు" అని ఏవోవో గొణుక్కుంటా ఉంది.
కొడుకు చూపులు మరింత నేలబారుగా దిగిపోయాయి. ఏం చేయాలో తెలీదు. ఎలా అనునయించాలో తెలీదు. ఎవర్ని అనునయించాలో తెలీదు. ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే  అతనికి మా చెడ్డ చిరాకు.
అతనసలే గొడవలంటే పడని మనిషి. సాయినాధుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుకునే మనిషి.
.............................................
"అవునే, నువ్వు దొజస్తంభం లేపిన పెతివ్రొతవి. మాదే లంజె వొంశం".....సుజాత గొంతు పీలగా పలుకుతా ఉంది.
"కాకపోతే ఒకరి కూడికి ఆశపడితిరే లేకిముండా....నా కష్టం నేను పడుకుంటా నా బతుకేదో నేను బతుకుతా ఉంటే అందరికీ నామీదే కన్నేమే సొట్టముండా.... వయ్యారంగా తిప్పుకుంటా తిరగడం కాదే, కష్టపడితే తెలుస్తాదే...కష్టపడి బతకాల. మొగోళ్లా బతకాల. బాంచత్‌ అని ఒకడి మొకం మీద కొట్టినట్టు బతకాల. ముడ్డి తిప్పుకుంటా మాటలు చెప్పుకుంటా తిరగడం కాదు...."
గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క.  గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది.
సుజాతకు ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ఇంతకుముందుకూడా ఇది నోరేసుకుని బతికిందే కానీ ఇట్టా ఎదుటోళ్లని తిట్టేటపుడు ఏడవడం ఏనాడూ చూడల్యా.
సుబ్బక్క సుజాతనే తిడుతోందో..ఇంకెవర్నయినా తిడుతోందో అర్థంకాక  జుట్టు పీక్కుంటా ఉన్నాడు పక్కింటి ఎంగటేశులు. సిమెంట్‌ తీసకపోయినదానికి ఇంత ఏడుపు దేనికో అతనికి ఎంత ఆలోచించినా అర్తం కావడం ల్యా.
(బొమ్మ వేసిన వారు- అక్బర్‌ )
(సారంగ వెబ్‌మ్యాగజైన్‌లో డిసెంబర్‌ మాసంలో ప్రచురితం)

Wednesday, 27 November 2013

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం


             ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ   ఇంటర్‌నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో  విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే  మ్యాగజైన్‌లో యాతండీ వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ  మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్‌ లేట్‌ దెన్‌ నెవర్‌.
     మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా.  మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య  అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు  పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్‌ రష్‌లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం  వినిపించినంతగా సెన్సిబిల్‌ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్‌ సెన్సిబిల్‌ సినిమా, షిప్‌ ఆఫ్‌ థీసెస్‌  సెన్సిబిల్‌ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం.  సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్‌ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి  వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.

    ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు  తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన  పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో  పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్‌ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ.  సోమయాజి,  సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి  తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప.  అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా  చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్‌ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు.  సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.
          60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్‌ ప్రచారం చేశారు. ఈ అమ్మ "కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ'' కాదు. "ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ'' కాదు.   ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్‌మామ్‌ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా "శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న'' రైతో మరొకరో  కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్‌మాన్‌ అప్పదాసు.   శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్‌గా ఏమీ ఉండదండి! అది  కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్‌ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త  వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. "వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న" భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు  తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి  మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్‌ ఇంజనీర్లు అయి సామాజిక  సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు.  మళ్లీ ఇపుడు వృత్తులను  ఆరాధించే పద్ధతిలో  వాటి చిహ్నాలను చూపిస్తే  అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!


     అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్‌ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే.  అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే  ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా  చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు  మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని  వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి  మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్‌ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే  సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే  ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు  సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి  ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు  పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్‌లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా,  పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో.  ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్‌తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ  సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్‌  శంకర్‌మఠ్‌, విద్యానగర్‌ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్‌ కాలేజీ రైల్వేస్టేషన్‌ బెంచీలమీద కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా  మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.
     వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు  అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది.  అదే సమయంలో  పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది.  మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్‌ తోనో కాకుండా తమ ఒడిలో  కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో  చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది.  రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి  మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు.  గ్రామీణ జీవనంలో కోల్పోయిన 'ఆనందాల' కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్‌ఆర్‌ఐల్లో  ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని  విజువల్‌గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది  అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్‌ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్‌ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని  విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా  "రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము'' అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్‌ పెట్టి నానా యాగీ  చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది.  కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను  చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి.  అందువల్ల ఆ భాష వదిలేసి దాని  బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  ప్రాక్టికల్‌గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ  ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.
        ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్‌ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్‌ షో  చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే  ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్‌ ఛేంజ్‌ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! "వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం,  ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి" అని సోమయాజి ఉరఫ్‌ అప్పదాసు ఉరఫ్‌ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ  ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్‌ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా!   ఏ సంప్రదాయ  జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్‌ కూడు తిని అనారోగ్యంగా  తయారయ్యామని, గ్రామాల్లో  రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని  మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్‌  వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్‌ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి  మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం  అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్‌ చెకింగులతో, ఇన్సూరెన్స్‌లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం.  70ల్లో కూడా  టింగురంగా అంటూ టీషర్ట్‌, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం 'అత్యాధునిక' మాయ.

    ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ!  మేమొక సినిమా తీశాం, మంచి సినిమా  తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు,  సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ!  అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను  ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో  నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని  చెట్లను మెయిన్‌టెయిన్‌ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా  ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా  ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ  లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా  అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్‌సోషల్‌గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్‌  కొట్టించితిరి కదా, మరి గ్యాస్‌ స్టవ్‌ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజ్‌ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్‌  కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్‌ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్‌ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి,  బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్‌. వాటిని డిస్ట్రబ్‌ చేయడం డైరక్టర్‌కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా  కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.  
         " రిటైర్‌మెంట్‌ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా  ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్‌ చేసి పెట్టాం'' అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్‌గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని  సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్‌ ఏలియన్స్‌ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్‌ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!
(జి ఎస్‌ రామ్మోహన్‌)
(సారంగ వెబ్‌మ్యాగజైన్‌లో 2013 నవంబర్‌ 14న ప్రచురితం)

Thursday, 22 August 2013

దృష్టిలోపంతో దారితప్పిన కథలు

ఖదీర్‌ వాక్యం డ్రైవింగ్‌ తెలిసినవాడు పద్దతిగా వాహనం నడుపుతున్నట్టు ఉంటుంది అంటాడు పూడూరి రాజిరెడ్డి. గేర్‌ ఎక్కడ మార్చాలో ఖదీర్‌కు బాగా తెలుసు. ఇపుడు బియాండ్‌ కాఫీతో అతను చేసిందదే. ఇంతకుముందే కింద నేల ఉందితో అతను హైజంప్‌ చేశాడు. ఇపుడు ఏకంగా పోల్‌వాల్ట్‌. అందులో ఎంత సఫలీకృతుడయ్యాడనేది తర్వాత చూద్దాం. పాతను వదిలేసుకుని కొత్త ముఖమైతే తొడుక్కున్నాడు. బహుశా దర్గామిట్ట నాటి పాత అభిమానులకు కూడా వదిలేసుకునేందుకు సిద్ధపడ్డాడని అర్థమవుతోంది. రచయితతో పాటు ప్రయాణం చేసే వారి కథ వేరే.
        దర్గామిట్ట కథలను చాలామంది ప్రేమించారు. బహుశా నామినిని మించి ప్రేమించారేమో కూడా. ఆ కథల్లోనూ ఆ ప్రేమలోనూ చిన్న ఇబ్బంది ఉంది. పచ్చనాకు సాక్షిగా అయినా, సినబ్బ కథలైనా, మిట్టూరోడి కథలైనా నామిని కథల్లో పెయిన్‌ ఉంటుంది. పైకి తమాస మాటల్లాగే కనిపిస్తాయి. లోపలికి పోయే కొద్దీ అంతులేని దుఖ్ఖం పొంగుకొస్తుంది.  " మా కన్నెబావ రామభక్తి'' గుర్తొచ్చినా, "నా రెక్కలున్నంత కాలం'' గుర్తొచ్చినా ఇప్పటికీ లోలోపల మెలిపెడుతుంది.  అవి నీడ కరవైన వారి ఏడుపు పాటలు. నామినిలో ఉన్న సొగసు చాలావరకు ఖదీర్‌ కథల్లో ఉంటుంది కానీ ఈ పెయిన్‌ తక్కువ.  పేదరికాన్ని సెలబ్రేట్‌ చేసినట్టుంటాయి దర్గామిట్ట కథలు. తమకు తెలీని జీవితాన్ని  కులీనులు నోరెళ్లబెట్టి చూసి అరె, భలే రాశాడే అనిపించేట్టు ఉంటాయి. హైదరాబాద్‌లో శిల్పారామం పోయి అక్కడ గుడిసెలు, రోకళ్లు, రోళ్లు, ఎద్దుల బండ్లు చూసి ముచ్చడపడతారే, అలా! కందిపచ్చడి, గుమ్మడిపులుసుతో పాటు ఆ కథలను కూడా ఇష్టపడడంలో ఇబ్బంది ఉండదు.  ఆ జీవితంతో సంబంధంలేని కులీనులకు, దాటి వచ్చిన దారిద్ర్యాన్ని మురిపెంగా మాత్రమే గుర్తుచేసుకునేవారికి ఆ కథలు మంచి వినోదాన్ని కలిగించగలవు. మనల్ని ప్రశ్నించని ఇబ్బంది పెట్టని వినోదం అలాంటివారికి బాగానే ఉంటుంది. నామినిని ఖదీర్‌ను విభజించే ప్రధానమైన రేఖ ఇదే. పాపులర్‌ ఫేమస్‌ రెండూ ఒకేలా కనిపించినంత మాత్రాన తేడా లేదనగలమా!


      అయితే దర్గామిట్ట నుంచి చాలా ప్రయాణమే చేశాడు ఖదీర్‌. పెండెం సోడా సెంటర్‌ లాంటి ప్రాపగాండా కథలను దాటుకుని చాలాకాలం క్రితమే కిందనేల ఉంది అని భూమార్గం పట్టాడు. ఈ ప్రయాణం పొడవునా జీవితంలోనూ అధ్యయనంలోనూ కొత్త ఎక్స్‌పోజర్‌ చాలానే వచ్చి ఉండాలి. అదంతా ఇపుడు బియాండ్‌ కాఫీ రూపంలో మన ముందుకొచ్చింది. ఏ లాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ కాఫీ అంటుంది కాఫీడే. నువ్వు తీసుకునే పదార్థం కంటే దాని చుట్టూ ఉన్న వాతావరణం ఇతరత్రా నీకు 'ఉపయోగపడే' పద్ధతుల గురించి చెపుతుందా స్లోగన్‌. దటీజ్‌ బియాండ్ కాఫీ. మీరు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దాటాక పైన సింపుల్‌గా కనిపించి లోపల అడుగుపెడితే విస్తుపోయే ప్రపంచాన్ని చూపించే బియాండ్‌ కాఫీ షాప్‌ ఎలాంటిదో ఈ కథలూ అలాంటివే. ఇది మనబోటి వాళ్లకు పరిచయంలేని ప్రపంచం అని రాస్తే ఆత్మవంచన అవుతుంది. ముఖ్యంగా మనం పట్టణజీవులమైతే! మనం చూడదల్చుకోకుండా మొకం తిప్పేసుకుని పోతే తప్ప ఈ జీవితం పట్టణవాసులకు తెలీకుండా పోయే అవకాశం లేదు. మానవజీవితంలో సెక్స్‌ లేమి లేదా దాని యావ సృష్టించగల విలయాన్ని ప్రధానంగా తీసుకుని రాసిన కథలు అనిపిస్తుంది. అందులోనూ స్ర్తీ కేంద్రకంగా రాసిన కథలు. బహుశా కొంతమంది అర్బన్‌ మహిళల వల్నర్‌బిలిటీని కూడా చిత్రించిన కథలు. డబ్బూదస్కానికి లోటు లేని వారి జీవితాల్లో ఇతరత్రా ఉండే సంక్షోభాలు.  "అన్నీ ఉండడం కూడా శిక్షేనే'' అనుకునే వారి జీవితాలు. ఏది రాసినా దానికి సంబంధించిన ఆవరణాన్ని, భాషను పట్టుకోవడంలో ఖదీర్‌ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంతేకాదు. అక్షరాలను దృశ్యాలుగా మార్చగలిగిన శక్తి గలిగిన కొద్దిమంది రచయితల్లో ఖదీర్‌ ఒకడు.
      "తీరుబడికి స్ర్తీత్వం తోడైతే ఆ శాపం రెట్టింపై అది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్‌బాబు పసికట్టాడు" అని ముందుమాటలో అంచనావేశారు అన్నపనేని గాంధీగారు. మూలుగుతున్న కోట్లరూపాయలు కొడుకు మగతనాన్ని దొంగిలిస్తే డ్రైవర్‌నో మరొకర్నో 'తగులుకుని' ఎవర్నీ పూచికపుల్ల చేయకుండా చులకనగా చూసే కోడలి 'పొగరు'ను మంత్రతంత్రాలతో అణచివేయాలని చూసే తల్లి తాపత్రయం, భర్త తాగుడుకు బానిసై తనను పట్టించుకోకపోవడమే కాకుండా పదే పదే చికాకులు తెస్తూ ఉంటే ఆ ఫ్రస్ర్టేషన్‌ని మోసుకుంటూ తిరిగే ఒక ఇల్లాలి వేదన, భర్త ఆఫీసుకు అంకితమైపోగా  చిన్నపుడు ప్రతి చిన్నదానికి తనమీదే ఆధారపడే పిల్లలు ఇపుడు నీకేం తెలీదు పోమ్మా అని దులిపేసుకుని పోతుంటే  లోలోపల రగిలి రగిలి వాళ్లనూ వీళ్లనూ ఫోన్‌లో వేపుకు తినే ఇల్లాలు...ఇదిగో ఇలాంటి వారి కథలివి. కోడలు అలా చేయడంలో తప్పేముంది, ఆమెనెందుకు విలన్‌ చేయాలి అనే ప్లేన్‌లోకి వెళ్లి పొలిటికల్లీ కరెక్ట్‌నెస్‌ కొలబద్దతో వీటిని చర్చించకుండా కేవలం రచయిత చెప్పదల్చుకున్న కోణానికే పరిమితమవుదాము.
      తొలి మూడు కథలు కథలే. అందులోనూ టాక్‌ టైమ్‌ మంచి కథ. ఆ తర్వాత అవి ఎటోటో వెళ్లిపోయాయి. 'మచ్చ' మంచిదే కానీ చివర్లో రచయిత అలవోకగా  విసిరేసిన ఒక వాక్యం కథను దెబ్బతీసింది. భర్త నిర్లక్ష్యానికి తోడు తీరుబడి ఎక్కువైన మహిళ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరో పొరబాటున తగిలినా రచ్చరచ్చ చేసేస్తుంది. చివర్లో ఆమె ఉద్యోగంలో చేరడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకుముందు వచ్చే మచ్చలు ఇపుడు రావు. అంత వరకు బాగా ఉంది. కానీ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరైనా నిజంగానే రాసుకున్నా ఇపుడు ఆమెకేమీ అనిపించడం లేదు అని రచయిత ముక్తాయిస్తాడు. సెన్సిబిల్‌ పాఠకులు గాయపడే ఎక్స్‌ప్రెషన్‌.  ఏకాభిప్రాయం తీసుకుందాం. అది కథ అవుతుందా? రచయిత ఏం చెప్పదల్చుకున్నాడు?  వివాహ బంధం బయట కూడా సెక్స్‌ సంబంధాలు నార్మల్‌ అని చెప్పదల్చుకున్నాడా? మగవాడు వల్నర్‌బుల్‌గా ఉండే ఆడవాళ్లని లోబరుచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తాడు అనేది చెప్పదల్చుకున్నాడా? ఇంకోవైపు కథ కథేనా! పట్టాయ ఉంది. ఏముంది అందులో? ఏఏ వీధిలో ఏఏ రూపాల్లో సెక్స్‌ దొరుకుతుంది అని చెప్పాడు. ఆ కథ చదివిన తర్వాత మనకందేదేమిటి?  "పోయే బోడిముండా అన్నాడు నాయుడు ముద్దుముద్దుగా, తాంకూ తాంకూ అంటూ నవ్విందది'' అనే వాక్యాలతో మొదలవుతుంది కధ. నవ్విందది అని రచయిత స్వరంతోనే ఆబ్జెక్టిఫై చేశాక ఇక పాఠకుడు ఏ ఫీల్‌తో కథను కొనసాగిస్తాడు? రచయిత స్వరం మాత్రం రచయితదేనా అని సిద్ధాంతాలను లాగొచ్చు కానీ అవి ఈ కథకు అతకవని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. కథంతా ఆ బండది, ఈ షార్ట్‌స్కర్ట్‌ది అని శరీరాలను ఆబ్జెక్టిఫై చేస్తూ ఒక చీకటి మూడ్‌ని క్రియేట్‌ చేసి మధ్యలో సడన్‌గా "వీళ్లు కూడా అందరు ఆడపిల్లల్లా పుట్టినవాళ్లే ....మన అమ్మల్లాగా అక్కల్లాగా చెల్లెళ్లలాగా ఈ ప్రపంచం నుంచి వేరే ఏమీ ఆశించకపోయినా కాసింత మంచిని ఆశించినవాళ్లే'' అని ధర్మోపన్యాసం ఇచ్చినంత మాత్రాన పాఠకుడిలో ఉదాత్తభావం వచ్చేయదు. ఖదీర్‌లో స్కీమింగ్‌ ఎక్కువ. అన్ని సందర్భాల్లో అది ఫలితాలనిస్తుందని ఆశించకూడదు. మధ్యలో అక్కడక్కడా ఒకట్రెండు మానవీయ దినుసులు వేశానులే అని సంతృప్తిపడితే కుదరదు. పదార్థ స్వరూపం మారదు. రచయిత హృదయం ఎక్కడ ఉందో తెలియాలి. ఎక్కడ కోపం రావాలో అక్కడ రావాలి. ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి. అవి మిస్‌ప్లేస్‌ అయితే కథ దెబ్బతింటుంది. ఇక్కడదే జరిగింది.
           పుస్తకానికి టైటిల్‌ బియాండ్ కాఫీ కథ తీసుకుందాం. "ప్రతి మగనాబట్ట ఛాతీ మీద పచ్చబొట్టు పొడవాల్సిన'' నీతి కథ చెప్పిన మరికాసేపటికే ఆ పొందికలోకి ఇమడని డీటైల్స్‌ ఎక్కువైపోయి, చివర్లో క్రైం థ్రిల్లర్‌ అయిపోయి కథ ఎటో పోయింది. తాను కొత్తగా తెలుసుకున్న విషయాలు ఎక్కువగా చెప్పాలన్న  ఆత్రం ఈ కథను దెబ్బతీసిందేమో అనిపిస్తుంది. ఇక  "చిన్నపుట్టుమచ్చ లాంటి బొట్టు" ఉన్న అమ్మాయి కథ చూద్దాం. కథ నుంచి మనకు అందుతున్నదేమిటి? టీ బండి నడుపుకునే  చిన్న అమ్మాయి ఇలాంటి వ్యవహారాల్లో రాటుతేలి ఉంటుందని ఊహించలేదనే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. అంతే! వాళ్లు అలా రాటుతేలడానికి కారణమైన పాత్రపై సానుభూతి వచ్చేలా కథ నడిపించాక, పన్నెండేళ్ల పాపని అబ్యూజ్‌ చేసిన మనిషి మీద సానుభూతి కలిగేలా కథ నడిపించాక ఇక ఎలాంటి స్పందన ఆశిస్తాం. ఇలాంటి అంశాలు కథాంశంగా తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు. చెప్పొచ్చు. కానీ పద్ధతి ఏమిటనేది ప్రశ్న. ఖదీర్‌ పుట్టమచ్చ లాంటి బొట్టున్న అమ్మాయి లాగే నామిని మెడకింద గీతలున్న అమ్మాయి గురించి రాస్తారు. గొడ్లకాసుకునే అమ్మాయి గురించి రాస్తారు. ఊర్లో బొడ్డుతెగిన ప్రతి మగోడు ఆ అమ్మాయి మీద పడడం గురించి రాస్తారు. కానీ చదివాక మనలో కలిగే స్పందన వేరే. ఆ పాప బాధ పాఠకుడి బాధగా మారుతుంది.
        మన దగ్గర చాలామంది రచయితలు ఏం చెప్పదల్చుకున్నారన్నదానిమీద పెట్టినంత దృష్టి దానికి సాహిత్య రూపం ఇవ్వడం మీద పెట్టరు. ఖదీర్‌ కథ వేరు. ఎలా చెప్పాలన్నదానిమీద అతను విపరీతమైన శ్రద్ధ పెడతాడు. కానీ ఏం చెప్పదల్చుకున్నామనేదానిమీద అంత శ్రధ్ధ ఉన్నదా అనేది సందేహం. కొంచెం బరువైన భాషలో చెప్పుకుంటే దృక్పథాన్ని  సరిచూసుకోవాల్సి ఉన్నదేమో అనిపిస్తుంది.
         లైంగిక వాంఛకు సంబంధించిన వివిధ సందర్భాలను వివరించడంలో  నైపుణ్యాన్ని చూపాడు. ఒక కథలో "పురుషుడు స్ర్తీని పట్టుకున్నట్టు" అని రాసి ఆ తర్వాత "వాళ్లు ఇంటినుంచి బయటపడడానికి మరికొంత సమయం పట్టింది" అంటాడు. ఇంకో కథలో "ఆమె కాళ్లు పట్టేది" అంటాడు. "అతను  నిద్రపోకుండానే మెళకువగానే ఉండి వెళ్లేవాడు, ఇపుడు అదేమీ లేదు" అని చెప్తాడు.  "కాసేపు రెస్ట్‌ తీసుకుని వెళ్దామా మేడమ్‌" అని గడుసుగా చెప్పిస్తాడు. వహీద్‌ అనే కథలో  ఆపా అని అంటూనే "చప్టామీద చేపలు పడేసి, ఊగిఊగి తోముతూ ఉండే ఎగిరిపడే అంచు"ను గుర్తుచేసుకునే చిన్నోడి స్థితిని వర్ణిస్తాడు. ఇలా ప్రతికథలోనూ వొడుపు చూపుతాడు.  ఇటువంటి  కథాంశాలని ఎంచుకోవడం కచ్చితంగా అభినందించాల్సిన విషయం. మానవజీవితంలో చాలాప్రాధాన్యమున్న ఈ విషయాన్ని, మన శారీరక మేధో వికాసాలమీద, మన వ్యక్తిత్వంమీద చాలా రకాలుగా ప్రభావం చూపే ఈ విషయాన్ని అసుంట ఉంచడం సరైంది కాదు. కాకపోతే ఎలా చర్చిస్తున్నామనేదే ప్రశ్న.
       తనకు అలవాటైన స్ర్తీ ఎంత ప్రేరేపించినా ఒక సర్దార్జీకి ఒంట్లో వేడిపుట్టకపోవడాన్ని  నేపథ్యంగా తీసుకుని మంటో రాశాడు. దాని పేరు థండా ఘోష్‌. అది చదివితే చల్లగా ఒణికిపోతాం. ఖోల్‌దో అయినా ఇంకోటయినా ఆయన కథలన్నింటా లైంగిక అంశాలే. కానీ అన్నీ మనిషి జంతువుగా మారే క్రమాన్ని బీభత్సంగా చిత్రిస్తాయి. ఎలాంటి స్థితిలో అయినా మనిషితనాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఫెలిని, గొడార్డ్‌ సినిమాల్లోనూ నగ్నదేహాలు కనిపిస్తాయి. కిస్లోవిస్కీ త్రీకలర్స్‌ ట్రయాలజీలో అయితే చెప్పడానికి లేదు. క్యూబా సినిమాల్లోనూ అంతే. కానీ అంతిమంగా అవి మనలో కలిగించే స్పందన వేరే.  ఖదీర్‌ తొలి మూడు కథలను మినహాయిస్తే  మిగిలిన కథలు అలాంటి చైతన్యాన్ని మనలో కలిగించడం లేదు. సున్నితమైన అంశాలను కథలుగా మలిచేపుడు ఎక్కువ జాగ్రత్త అవసరం. ఒడుపు తెలుసుకదా అని తొందరపడితే నోరు కాలుతుంది, చేయి కాలుతుంది. మొదటి కథల్లో మనకు బాధితులెవరో తెలుస్తుంది. వారిపట్ల ఎంతో కొంత ఆర్తి కలుగుతుంది. తాగుబోతు భర్త పట్టించుకోక ఏ ముచ్చటా తీరక విసుగ్గా ఉన్న మహిళ యాక్సిడెంటల్‌గా కలిసిన, తనపై ఆసక్తి కనపరిచిన కుర్రాడితో సెక్స్‌ తర్వాత స్థిమితపడే స్థితిని అర్థం చేసుకోగలము. ఆ మహిళ ఎర్రేటిక్‌ బిహేవియర్‌ని కూడా అర్థం చేసుకోగలం. చివరకు రచయితలకు ఫోన్లు చేసి భయంకరంగా వేధించే స్ర్తీ పైన కూడా కోపం రాదు.  ఆ తర్వాతి కథల్లోనే బ్యాలెన్స్‌ కుదరలేదు. అందులో చర్చించినవి కూడా అవాస్తవాలేం కాదు. కొంతమంది స్ర్తీలకు సంబంధించినవే అయినా అవి వాస్తవాలే. 'మైనారిటీ' కథలు రాయకూడదని రూలేం లేదు.  భర్త వేళ్లు కోసేసిన భార్య సంగతి పక్కనబెడితే చాలావరకు ఇందులో ఉన్న పాత్రలన్నీ నిజమైనవే. మనకు కనిపించేవే. కాకపోతే ఊరకే సంచలన వాస్తవాలను వెల్లడించడం దానికదే కథ కాదు కదా! ఆ వాస్తవాలకు సాహిత్య రూపమిచ్చేదేదో ఉంటుంది కదా! అది ఆ కథల్లో లోపించింది. కొన్ని కథల్లో వక్రీకరించింది కూడా. ఇంకో విషయం కూడా చెప్పక తప్పదు.  కొద్దిమందికే పరిమితమైన కథలు రాయడం వరకూ ఇబ్బంది లేకపోయినా సమాజంలో  ఒక సమూహం గురించి ఇంకో సమూహంలో ప్రచారంలో ఉండే స్టీరియోటైప్స్‌ని యథాతథంగా సమర్థిస్తున్నామేమో అనేది కూడా రచయిత ఆలోచించుకోవాలి.

        ముందు మాట రాసిన ఇద్దరూ పెద్దమనసుతో రచయితను సానుభూతిగా చూసి ఆశీర్వదించారేమో అనిపిస్తుంది. ముక్తవరం పార్థసారధిగారు "సింగింగ్‌ ఇన్‌ ది పెయిన్‌" అన్నారు. కానీ రచయితతో ఉన్న అనుబంధం వల్ల అతను ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించి ఉంటాడు అని అర్థం చేసుకుని పని గట్టుకుని మళ్లీ మళ్లీ అతని కళ్లలోంచి చదివితే తప్ప అందులో నొప్పి ఉందని అనిపించడం లేదు. కథ దానికదిగా అలాంటి స్పందన కలిగించడం లేదు. తొలి మూడు కథలు మినహాయింపు.
      "లోకంలో ఎవరు దేనిమీదైనా కథ రాయొచ్చు. కానీ ఎంత మేరకు సాహిత్యం చేశారనేది మీరు శ్రద్ధగా గమనిస్తారు" అని తనమాటగా ఖదీర్‌ రాశాడు. దీన్నే కొంచెం మార్చి చెప్పుకోవచ్చు. వొడుపు తెలిస్తే లోకంలో ఎవరు దేన్నైనా సాహిత్యం చేయొచ్చు. కానీ మంచి సాహిత్యం చేయడానికి ఒడుపుతో పాటు మరికొన్ని తెలియాలేమో!
జి ఎస్‌ రామ్మోహన్‌
(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌(sarangabooks.com/magazine)లో 22.8.2013న ప్రచురితం)

Monday, 29 July 2013

లౌడ్‌ థింకింగ్‌

అరె
బల్లి అటు తిరిగింది
ప్రపంచమెంత చలనశీలం 
కోటలు చుట్టేస్తాం
పేటలు దాటేస్తాం
పేరు మర్చిపేయి అందర్నీ అడుక్కుంటూ ఉంటాం
గమ్యాన్ని పలవరిస్తూ దారి మర్చిపోయిన బాటసారులం కదా
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
తెలిసిందంతా తెలీనిదని తెలీకే కదా
నేలా బండా ఆడుతూనే ఉంటాం
అక్షరాలు అబద్ధాలని తెలీకనే కదా
నిర్వచనాల నడుములిరగ్గొట్టడం తెలీకనే కదా
పదాల ఉప్పు మూటల్ని తిరగేస్తూనే ఉంటాం
విశేషణమే విశేషమనుకున్నాం కదా!
దీర్ఘకావ్యం రాస్తూ వ్యాకరణాన్ని మర్చిపోయిన రచయితలం కదా1
నామవాచకం సర్వనామమయ్యే మర్మకళ ఏదో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
వెతికిన దొరుకుననుకుంటాం
తట్టిన తెరువబడుననుకుంటాం
కొండలూ కోనలూ అరణ్యాలు పర్వతాలు తిరిగేస్తూనే ఉంటాం
గరళమని అసుంటుంచిన ఆ ఓల్డ్‌ ఓడ్కాను కసిగా ఒంపేసుకుంటాం
ఏం వెతుకుతున్నామో మర్చిపోయి ఎన్నేళ్లయిందో 
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
సప్తసముద్రాలకు ఆవల మాంత్రికుడి ప్రాణమున్న చిలుక 
అందమైన ఎరో అక్షరసత్యమో
అన్వేషణ సత్యమో లక్ష్యం సత్యమో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు

జి ఎస్‌ రామ్మోహన్‌
(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక(28-7-13)లో ప్రచురితం)


Friday, 19 July 2013

భారతీయుడు, హజారే, మోదీ

July 19, 2013-ఆంధ్రజ్యోతి
రాంబో కల్చర్ భారత రాజకీయాల్లో హడావుడి చేస్తోంది. హాలీవుడ్ రాంబో వియత్నాంలో చిక్కుకుపోయిన అమెరికన్లను రక్షిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబన్లకు అండగా నిలబడతాడు. ఎక్కడ ఏ దేశంలో తన సేవలు అవసరమైతే అక్కడ గద్దలా వాలిపోయి జనాలను రక్షించేస్తూ ఉంటాడు. వామపక్ష హీరో చే గువారాకు పోటీగా మనిషి దొరక్క హాలీవుడ్ సృష్టించుకున్న హైటెక్ కల రాంబో. ఇపుడు అదే నమూనాలో మన దేశంలో ఒక రాంబో బయలు దేరారు. ఆయన గుజరాతీయులు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయినా అక్కడ వాలిపోయి తమవారిని రక్షించేస్తూ ఉంటాట్ట! ఆ మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఇమేజ్ మేకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రేపు ఢిల్లీ గద్దెనెక్కితే ఇదే రీతిన భారతీయులను రక్షించగలడని ప్రచారం చేయడానికి ఆయన సైబర్ సైన్యం శక్తికి మించి ప్రయత్నిస్తోంది. ఈ సైబర్ సైనికులు గుజరాత్ ఆర్థిక అభివృద్ధి గురించి ఊదరగొడతారు. మానవాభివృద్ధి సూచికల్లో ఆ రాష్ట్రం వెనుకబడిపోవడం గురించి మాట్లాడరు.

హక్కుల సంగతి సరేసరి. దూకుడు ప్రచారంతో మత మారణకాండ మచ్చను మర్చిపోయేలా చేయొచ్చనేది వ్యూహం.మోదీ ఆజ్ఞలమేరకే ఇష్రత్ జహాన్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని అక్కడి పోలీస్ అధికారులు చెపుతున్నారు. గుజరాత్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు బయటపడడం ఇది తొలిసారేం కాదు. మామూలుగానైతే ప్రజాస్వామిక సమాజంలో అలాంటివి బయటకొస్తే నాయకులు భయపడిపోవాలి. కానీ బిజెపికి చీమకుట్టినట్టయినా లేదు. అన్నీ మన మంచికే అనుకుంటున్నట్టుంది వారి బాడీ లాంగ్వేజ్. బూటకం కాదు అని బిజెపి వాదించడం లేదు. ఆ అమ్మాయి ఉగ్రవాది అని అరుగెక్కి అరుస్తోంది. ఉగ్రవాదిగా ప్రచారం చేస్తే చాలు ఈ బూటకపు ఎన్‌కౌంటర్ వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ అని బిజెపి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ ధోరణి సమాజంలో వ్యాపించిన బలహీనతకు చిహ్నం. ఈ బలహీనత రాజకీయపార్టీలకు పరిమితమైనది కాదు. వ్యవస్థలో లిబరల్ ప్రజాస్వామిక విలువలు బలపడకపోవడానికి సంబంధించింది. ఈ బలహీనత కేవలం బూటకపు ఎన్‌కౌంటర్ల విషయంలో సమాజపు నిర్లిప్తతకు సంబంధించింది కూడా కాదు. అటువంటి నిర్లిప్తత ఆవహించి చాలాకాలమే అయ్యింది.

నిర్లిప్తత స్థాయిని దాటి 'మీరు మాత్రం చట్టాన్ని మీరవచ్చు, నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్పా'' అని ప్రశ్నించే అపరిచితుడు బాపతు పెరిగిపోతున్నారు. నియంతృత్వ పోకడలున్నా పర్వాలేదు, పని చేసిపెట్టేవాడు కావాలి అనేధోరణి పెరిగింది. ఇదైతే 90ల తర్వాత జరిగిన పరిణామమే. మధ్యతరగతిలో గొంతున్న వర్గం, గొంతు చించుకుని అరవగలిగిన వర్గం ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. మధ్యతరగతి బాహాటంగా మతోన్మాదాన్ని అంగీకరించడం కష్టం కాబట్టి అభివృద్ధి ముసుగు అవసరమైంది. అన్నా హజారేకు కొవ్వొత్తులతో హారతులు పట్టిన వారిలో చాలామంది ఇపుడు మోడికి హారతులు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలనాడు హైటెక్ చంద్రబాబు నాయుడిని పొగిడి పొగిడి అలసిపోయినవారు విశ్రాంతి తీసుకుని ఇపుడు మోడి భజనకు గొంతు సవరించుకుంటున్నారు. ఎక్కడో గుజరాత్ అనే చిన్న ఉత్తరాది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ మనమంతా అటో ఇటో తేల్చేసుకోవాల్సినంత వ్యక్తిగా ఎలా మారారు? ఆయన నిజాయితీ పరుడు,అడ్మినిస్ట్రేటర్, అభివృద్ధి పథగామి, వరుసగా ప్రజామోదం పొందుతున్నవాడు అని సెక్యులర్‌గా పొగిడేవాళ్లు నిజంగా అవే ప్రమాణాలని నమ్మితే వాటన్నింటిలోనూ ఆయనకంటే ఎన్నో మెట్లు పైనుండే మాణిక్ సర్కారు ఎందుకు కనిపించరు? బిజెపికి ఒక్క పార్లమెంట్ సీటు కూడా లేని రాష్ట్ర రాజధానిలో ఆయన ఉపన్యాసానికి ఐదు రూపాయల ఫీజు పెట్టగలిగిన నమ్మకం బిజెపికి ఎక్కడినుంచి వచ్చింది? హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకునే ఒక మధ్యతరగతి మనిషి, ఒక పబ్ గోయింగ్ యువకుడు 'మోదీ మగాడు సర్' అనే పరిస్థితి ఎందుకొస్తున్నది? బిజెపి భావజాలంపై ఆకర్షణ లేని వారు కూడా మోదీ వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? వీరి సంఖ్య బిజెపి పంట పండేంత ఉండకపోవచ్చు. కానీ ఈ ధోరణి పెరగడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి, ఏ సామాజిక సాంస్కృతిక పరిణామాలు మనల్ని ఇక్కడికి లాక్కొచ్చాయి అనే అంశాలైతే చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.


90ల తర్వాత వచ్చిన కొత్త సాధనాలు తెరచాటు మనిషిని ఆవిష్కరించాయి. సాటి మనుషుల కంటే తెరతో సంపర్కం పెరిగిపోయింది. ఆహార్యం దగ్గర్నుంచి ఆచార వ్యవహారాల దగ్గర్నుంచి అనేకానేక అంశాల్లో తెర మన ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ఈ తెర ఏదైనా కావచ్చు. మొబైల్ తెర కావచ్చు, కంప్యూటర్ తెరకావచ్చు. టీవీ తెర కావచ్చు. సినిమా తెర కావచ్చు. మనం ప్రధానంగా సినిమా జీవులం కదా! ఇంటర్‌నెట్‌లో మనం సెర్చ్ చేస్తున్నది అధికంలో అధికం సినిమాలే అని సర్వేల్లో తేలింది కదా! సినిమాల వైపు నుంచి వద్దాం. 90లకు ముందు సినిమాల్లో పోలీస్ ఎలా ఉండేవాడు? శుభం కార్డుకు ముందు వచ్చి గాల్లోకి కాల్పులు జరిపి హ్యాండ్సప్ అనేవాడు. విలన్లకు సంకెళ్లువేసి తీసికెళ్లేవాడు. టపా టపా కాల్చేసేవాడు కాదు. మధ్యమధ్యలో విలన్లను యు ఆర్ అండర్ అరెస్ట్ అనేవాడు. 'మిస్టర్ మీ దగ్గర వారెంట్ ఉందా' అని విలన్ స్టెయిల్‌గా ప్రశ్నించేవాడు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు పోలీసులొస్తారు అని జోకులు వినిపించేవి.

కానీ 90ల తర్వాత పోలీస్ ఎలా మారిపోయాడు? అతను తుపాకులతో డాన్సులు వేస్తాడు. విలన్లతో డాన్సులు వేయిస్తాడు. నేనసలే మంచాడ్ని కాదంటాడు. నేను సింహాన్ని అంటాడు. పండును అంటాడు. ఎదుట సూట్లుబూట్లలో ఉన్న వందలమంది రౌడీల దగ్గర గుళ్లు అయిపోతాయి కానీ మన పోలీస్ హీరో రివాల్వర్‌లో మాత్రం అయిపోవు. జోకులేస్తూ కాల్చేస్తూ జోకులేస్తూ చెడ్డచావులను యమా చెడ్డగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గాల్లో ఎగురుతూ నీటిలో దూకుతూ కొండలమించి దుముకుతూ చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో చిత్రవిచిత్రమైన యాంగిల్స్‌లో కాల్చిచంపడం ఎంటర్‌టెయిన్‌మెంట్ అయిపోయింది. శస్త్రం చేత చేధించబడని బుల్లెట్ చేతగాయపడని పోలీస్ ఎంటర్‌టెయినర్ అయిపోయాడు. అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే చట్టప్రకారం కుదరదు. మంచి పనికోసం చెడ్డదారి ఎంచుకున్నా ఫర్వాలేదు అనేది ఆమోదనీయమైన భావనగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది ఇటీవలి సినిమా. చట్ట ఉల్లంఘనను గ్లామరస్ విషయంగా మార్చింది సినిమా. ఈ పునాది మీద పైపై మార్పులతో ఎన్ని పోలీస్ సినిమాలొచ్చాయో విజ్ఞులైన తెలుగు పాఠకులకు అట్టే చెప్పనక్కర్లేదు.

ఈ క్రియేటివిటీ హద్దులు దాటి ఉత్తరాది దక్షిణాది మధ్య ఈ విషయంలో ఆదాన ప్రదానాలు ఎక్కువైపోయాయి. అక్కడ దబాంగ్ అనగానే ఇక్కడ గబ్బర్ సింగ్ అనాల్సిందే. రాజ్యాంగం, చట్టం లాంటి చాదస్తాలను పట్టించుకుంటే న్యాయం చేయలేం అనేది ఈ సినిమాలన్నీ అందించు నీతి. షార్ప్ షూటర్స్ సినిమా హీరోల పాత్రలకు మోడల్స్‌గా మారిపోవడం అలాంటి సినిమాలు తిరిగి సమాజంలో బూటకపు ఎన్‌కౌంటర్లకు ఆమోదం కలిగించడం ఒక సాంస్కృతిక విషవలయం. బలుపు, బద్మాష్, పోకిరి, రాస్కెల్ వంటి ప్రతికూల లక్షణాలు హీరోచిత లక్షణాలుగా, ఆమోదనీయ లక్షణాలుగా మార్చడం ఇంకో విష పరిణామం. ఇక ఇంటర్‌నెట్, టీవీ సంగతి చెప్పనే అక్కర్లేదు. మన ఆలోచనల్లో ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలు పెరిగిపోవడంలోనూ, మోదీ లాంటి అప్రజాస్వామిక వ్యక్తికి సామాజిక ఆమోదం రావడంలోనూ ఇలాంటి అంశాల పాత్ర చాలా ఉంది.


దీనికి కవల పిల్ల లాంటి మరో అంశం అవినీతి వ్యతిరేక సినిమా పోరాటం. భారతీయ సినిమాలో అవినీతి రూపుమాపడమనే బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి పేరు శంకర్. ఆయన సృష్టించిన అపరిచితుడుకు ఆయనే ప్రతీక. ఒక చేత్తో హీరో హీరోయిన్లను మచ్చుపిచ్చు, ఐఫిల్‌టవర్, పిరమిడ్ల మిద పాటలు పాడించేసి మరో నిర్మాత భయపడేంత ఖరీదైన వినోదం అందిస్తూ ఉంటాడు. మరో చేత్తో అవినీతి మీద ఒంటరిపోరాటం చేస్తూ ఉంటాడు. భారతీయుడు నుంచి శివాజీ దాకా ఆయన హీరోల కథే వేరు . ఒకరు మర్మకళతో అవినీతిపరులను అంతమొందిస్తారు. మరొకరు చిత్రవిచిత్రమైన శిక్షలు వేసి అంతమొందిస్తారు. మరొకరు మాఫియా డాన్‌ను మట్టికరిపించి బ్లాక్ మనీని బయటకు తెస్తారు. అవినీతి వ్యతిరేక పోరాటరూపాన్ని ఆచరణకు అసాధ్యమైన రూపంలో చూపించడం టక్కులమారి టెక్నిక్. అవినీతి మీద కోపాన్ని అడ్రస్ చేయాలి. కానీ మనం చేయాల్సింది ఏమీ లేదు, ఎవరో హీరో వచ్చి అన్ని తీసేసి పోతాడు అనే ఫీలింగ్ కలిగించాలి.

మనలోకి మనం చూసుకోవాల్సిన అవసరం కానీ మనచుట్టూ చూడాల్సిన అవసరం కానీ ఉండకూడదు. తెరమీద ప్రతీదీ మనం చూసి ఆనందించగలిగిన స్పెక్టకిల్‌గానే కనిపించాలి. వందల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన వాడిని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆపకుండా వెళ్లిపోయిన వాడిని ఒకే గాటన కట్టి ఇద్దరికీ నరలోకపు శిక్షలతో చిత్ర విచిత్రంగా చంపేయాలి. అవినీతిని బ్రహ్మపదార్థం చేసి జనంలో ఉన్న సెన్సిబిలిటీని చంపేయాలి. సమష్టి ఆచరణతో మార్చుకోవడం కాదు. వ్యవస్థను బాగుపరుచుకోవడం కాదు. కమల్ హసనో విక్రమో అత్యంత సినిమా తెలివితేటలతో అందర్నీ చంపేస్తూ ఉండాలి. మనమేమి చేయకుండా అంతా మారిపోతే ఎంత బాగుంటుంది అనుకునే మహామంచివాళ్లందరికీ గొప్ప వెసులుబాటు ఇలాంటి సినిమాలు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కోరికలాంటిదే ఇది.

ప్రజానాట్యమండలి అవశేషాలు మిగిలి ఉన్న కాలంలో భూస్వామి-పేద రైతు, ఫ్యాక్టరీ యజమాని-కార్మికుడి సినిమాల్లో జనం పోగవడం ఉంటుంది. 60లు,70ల్లో కనీసం జనం తూరుపు దిక్కుకు పిడికిళ్లెత్తి నడిచేవాళ్లు. ఇపుడు అన్ని పిడికిళ్లు అవసరం లేదు. అన్నీ ఒకటే చేయి చేసేస్తుంది. ప్రస్తుతం ఆ చేయిని మోదీలో చూసుకుంటోంది తెరాధునిక మధ్యతరగతి. మొన్నటికి మొన్న అన్నా హాజారేలో కూడా చూసుకుంది. మోడి వైపు చేసిన ప్రయాణంలో అన్నా హజారే ఒక ట్రాన్సిట్ పాయింట్.
హజారే అవినీతి వ్యతిరేకత అనగానే కార్పోరేట్ సంస్థలు, కార్పోరేట్ మీడియా అండతో వోకల్ మిడిల్‌క్లాస్ రోడ్లమీదకొచ్చింది. టీవీలు బ్రహ్మరథం పట్టాయి. తర్వాత ఆయనేమయ్యాడో తెలీదు. అన్నా హజారే వ్యవహారశైలిలో ప్రజాస్వామిక లక్షణాలు తక్కువ. పార్లమెంట్‌కు హక్కులను తగ్గించి ఎగ్జిక్యుటీవ్‌కి, జ్యుడీషియరీకి సర్వహక్కులు ధారపోయాలనడం ఇపుడున్న పరిస్థితిలో భలే భలే అనిపిస్తుంది. రాజకీయనేతలను కేరికేచరింగ్ చేసిన తెరాధునికత ఈ రెండు అంగాలను పెద్దగీతలుగా మార్చేస్తున్నది. మార్కెట్ శక్తులవైపు మన చూపు పడకుండా ఈ పనులన్నీ చేయగలగడంలో ఈ శక్తులకున్న నైపుణ్యం అపారం. ఎటువంటి కృషి చేయకుండానే ఫలితాలు తొందరగా రావాలనుకునే ఇన్‌స్టంట్ తరానికి ఇది పసందుగానే అనిపిస్తుంది. కానీ అది భస్మాసుర హస్తం అవుతుందనే ఎరుక వారికుండదు. మన కొవ్వొత్తుల బ్యాచ్‌కి అంత దీర్ఘకాలికంగా చూపు సారించే ఓపిక ఉండదు. దాని పర్యవసానమే గోగెటర్‌ల పట్ల ఆరాధన. 'గో అండ్ గెట్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్' అనేది వర్తమాన నినాదం.

90ల తర్వాత విశ్వరూపమెత్తిన ఈ మార్కెట్ నినాదం తాలూకు ప్రతిఫలనమే మోదీ. మార్కెట్ పూర్వకాలపు గ్రామిణ సమాజంలో మాదిరి పచ్చిగా మొరటుగా ఉండదు. ఆది తనమీద తానే ఉద్యమాలు చేసుకోగలదు. ఎంతలో కావాలో అంతలోనే ఎప్పుడు కావాలో అప్పుడే చేయించగలదు. ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపేయగలదు. ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామిక వాదులు చాలా కాలంగా మాట్లాడుతున్న భాషను మార్కెట్ హైజాక్ చేసి తనకు అవసరమైనట్టు టైలరింగ్ చేసుకుంది. ఆమ్ ఆద్మీ స్థానంలో టాక్స్‌పేయర్ పరిభాష వచ్చి చేరింది. అన్ని రంగాల్లో ఈ అప్రాప్రియేషన్ కొనసాగుతున్నది. వోకల్‌గా ఉన్న మధ్యతరగతి నియంతృత్వాన్ని ప్రేమిస్తోంది. ప్రజాస్వామికంగా ఉండే వ్యక్తులతో, రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించే వ్యక్తులతో న్యాయం జరగదు. వాటిని పట్టించుకోకుండా అర్జెంట్‌గా ఏదో ఒకటి చేసేవాడు కావాలి. పెట్టుబడులను, జిడిపిని పెంచేవాడు కావాలి. ఒక్కముక్కలో తమకు ఏవి అవసరమని అనుకుంటున్నారో అవి ఎలాగైనా సాధించిపెట్టే గో గెటర్ కావాలి. మోదీ అనే వ్యక్తి రాంబో అవతారమెత్తి భారతసమాజం మీద కత్తిలా వేలాడడానికి వెనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి.

అతను గోగెటర్! మధ్యతరగతిలో ఒక సమూహం కోరుకుంటున్న రాంబో. కారుకింద ఎన్ని కుక్కపిల్లలు చనిపోయినా పట్టించుకోకుండా దాన్ని వారు కోరుకున్న గమ్యానికి చేర్చగలిగిన డ్రైవర్. కానీ వారు మర్చిపోతున్న అంశం ఒకటుంది. తెరమీద హడావుడి చేసే రాంబో నిజమైన యుద్ధంలో నిలబడి గెలుస్తానడనడానికి ఆధారమేదీ లేదు. కెమెరాల రాద్దాంతానికి, సైబర్ హడావుడికి దూరంగా సైలెంట్ మెజారిటీ ఉంటుంది. దాన్ని నిద్రలేపే శక్తులు ఇపుడు బలహీనంగా కనిపించొచ్చు. కానీ బలహీనత శాశ్వతం కాదు.